శనివారం 29 ఫిబ్రవరి 2020
గిరిజనాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

గిరిజనాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

Feb 15, 2020 , 02:21:53
PRINT
గిరిజనాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి
  • ప్రభుత్వమే సేవాలాల్‌ జయంతి నిర్వహిస్తున్నది
  • బంజారా సాంస్కృతిక సంబురాల్లో స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం, ప్రగతికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ సంఘం, సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 281వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రవీంద్రభారతి ప్రాంగణంలో బంజారా సాంస్కృతిక సంబురాలు నిర్వహించారు. గిరిజనుల అభ్యున్నతికి కృషిచేయడంతోపాటు ఉన్నతస్థాయికి చేరుకున్న గిరిజన ప్రముఖులకు మహా భోగ్‌ బండార్‌, సేవాలాల్‌ మహరాజ్‌ పేరిట పురస్కారాలను ప్రదానంచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్‌ మాట్లాడుతూ.. సేవాలాల్‌ మహరాజ్‌ కేవలం గిరిజన ఆరాధ్య దైవం మాత్రమే కా దని, అందరూ ఆయన సూచించిన మార్గాన్ని అనుసరిస్తారన్నారు.  సీఎం కేసీఆర్‌ గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాముఖ్యం కల్పిస్తున్నారని, గిరిజన విద్యాప్రగతికి గురుకులాలను సమర్థంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. సంత్‌ సేవాలాల్‌ జయంతిని పురస్కరించుకొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.


 వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల మాట్లాడుతూ.గిరిజన సంప్రదాయాలు భవిష్యత్‌ తరాలకు చాటి చెప్పేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ సంప్రదాయాలను, ఆచారాలను సీఎం కేసీఆర్‌ కాపాడుతూ  దేశంలోనే ఆదర్శవంతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పారు. బంజారాహిల్స్‌లో రూ.కోట్లు విలువైన భూమిని కేటాయించి,బంజారా, కుమ్రంభీం భవనాలను నిర్మిస్తున్నారని తెలిపారు. పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులు స్వయం పాలన చేపట్టేలా సీఎం కేసీఆర్‌ కృషిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మీర్‌పేట మేయర్‌ దీప్‌లాల్‌, రాష్ట్ర సమాచార కమిషనర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


నేడు తెలంగాణభవన్‌లో భోగ్‌బండార్‌  

సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాల భోగ్‌ బండార్‌ను శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరవుతారని, గిరిజనులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


logo