బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:32

సాహితీ యోధుడు దాశరథి: సీఎం

సాహితీ యోధుడు దాశరథి: సీఎం

  • నేడు దాశరథి జయంతి

గంగమ్మ పొంగింది నిండుగా

భూదేవి పండింది దండిగా

మన దేశ సంపదను పెంచుదాం

కర్షకులు కార్మికులు అండగా

వచ్చింది వచ్చింది శ్రావణం

భారత ప్రజలకు ఇది పావనం

నీలాల మేఘాల నీడలో 

విరిసింది మన జాతి జీవనం

- దాశరథి

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ సాహితీ యోధుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దాశరథి కృష్ణమాచార్య 96వ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ ఆయనకు నివాళులు అర్పించారు. 1925 జూలై 22వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో దాశరథి కృష్ణమాచార్య జన్మించారని గుర్తు చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పట్టా పొందిన ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడని పేర్కొన్నారు. చిన్నతనంలోనే పద్యరచనలో ప్రావీణ్యం సంపాదించారని గుర్తుచేశారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించారని గుర్తుచేశారు. సాహిత్య రంగానికి దాశరథి అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా ఆయన జయంతిని నిర్వహిస్తూ, అవార్డులను ప్రదానం చేస్తున్నదని కేసీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం దాశరథి అందించిన ఉద్యమచైతన్యస్ఫూర్తిని కొనసాగిస్తున్నదన్నారు.


logo