శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:37

కేసీఆర్‌ కిట్‌తో క్షేమంగా తల్లీబిడ్డ

కేసీఆర్‌ కిట్‌తో క్షేమంగా తల్లీబిడ్డ

  • గణనీయంగా తగ్గిన మాతాశిశు మరణాల రేటు
  • అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేసీఆర్‌ కిట్‌ పథకంతో అద్వితీయమైన ఫలితాలు వస్తున్నాయని, అందుకు కేంద్ర ప్రభుత్వ గణంకాలే నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. శాసనసభలో సోమవారం వైద్యారోగ్యశాఖపై ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ఎంతో అధ్యయనం చేసి సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని చెప్పారు. గతంలో వెయ్యి శిశువులకు 39 మంది చనిపోయేవారని, ఆ సంఖ్య ప్రస్తుతం 25కు తగ్గిందని, ఐదేండ్లలోపు పిల్లలు 45 మంది మరణించగా, ఇప్పుడు 35కి తగ్గిందని వెల్లడించారు. బాలింతల మరణాల రేటు 113 నుంచి 63కు పడిపోయిందని, ఈ విషయంలో కేంద్రప్రభుత్వం సైతం తెలంగాణను ప్రశంసించిందని మంత్రి గుర్తుచేశారు.

కొత్తగా 22 ఎంసీహెచ్‌ కేంద్రాలు

 కేసీఆర్‌ కిట్‌ పథకంతో ఇప్పటివరకు 11,91,275 మంది లబ్ధి పొందారని మంత్రి ఈటల తెలిపారు.  రాష్ట్రంలో 1350 పడకలతో 9 ఎంసీహెచ్‌ కేంద్రాలు సేవలను అందిస్తున్నాయని, రూ.407 కోట్లతో కొత్తగా 22 ఎంసీహెచ్‌ కేంద్రాలను నిర్మించనున్నామని వెల్లడించారు. 


logo