e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides ఫంగస్‌పై దంగల్‌

ఫంగస్‌పై దంగల్‌

ఫంగస్‌పై దంగల్‌
 • రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు
 • రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ను సమర్థంగా అడ్డుకోవాలి
 • అవసరమైన అన్ని మందులకు ఆర్డర్‌
 • బ్లాక్‌ఫంగస్‌ బెడ్ల సంఖ్య 1500కు పెంపు
 • యుద్ధ ప్రాతిపదికన డాక్టర్ల నియామకాలు
 • సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
 • కరోనా నియంత్రణే తొలి ప్రాధాన్యం
 • ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు మానవతా దృక్పథంలో స్పందించాలి
 • ఖర్చుకు ఎంత మాత్రం వెనుకాడవద్దు
 • పోలీస్‌, వైద్యారోగ్యశాఖల బడ్జెట్‌ పెంచాలి
 • మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించాలి
 • పొరుగు రాష్ర్టాల వారికి చికిత్స తప్పేలా లేదు
 • ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు
 • నేటి నుంచి పరీక్షల సంఖ్యను పెంచాలి
 • వైద్య కేంద్రానికి వచ్చే అందరికీ టెస్టులు
 • అన్ని పడకలకూ ఆక్సిజన్‌
 • 600 టన్నులకు ఆక్సిజన్‌ ఉత్పత్తి
 • థర్డ్‌వేవ్‌కు సిద్ధంగా ఉండాలి
 • తగినన్ని వ్యాక్సిన్లు తెప్పించాలి
 • ఉత్పత్తిదారులతో మాట్లాడాలి
 • మంత్రి కేటీఆర్‌ టాస్క్‌ఫోర్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

అటు కరోనా ఇటు బ్లాక్‌ ఫంగస్‌తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో ఉన్నది. కరోనా కట్టడికి ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి, అవసరమైతే అప్పు తెచ్చి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి ప్రస్తుతం కరోనా నియంత్రణకు మించిన ప్రాధాన్యం మరొకటిలేదు. ప‌క్క‌ రాష్ట్రాల నుంచి కరోనాతోపాటు బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం రోగులు తరలివస్తున్నారు. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాస్తవమే. అయితే.. కరోనా చికిత్స విషయంలో నాలుగు కోట్లుగా కాకుండా పది కోట్లుగా అంచనా వేసుకోవాలె. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవాళ్లకు కూడా మనం చికిత్సను అందజేయక తప్పేటట్టు లేదు.
‘రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, ఆరోగ్యరక్షణలో భాగంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతున్నది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాలి. సత్ఫలితాలనిస్తున్న ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తూ లక్షణాలున్నవారికి మందుల కిట్లను అందించాలి. టెస్టుల కోసం వచ్చేవారందరికీ పరీక్షలు నిర్వహించాలి.
-ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 24 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి కోలుకున్నవారిని మరోసారి భయపెడుతున్న బ్లాక్‌ఫంగస్‌ చికిత్స కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్లాక్‌ఫంగస్‌ బెడ్లను 1500కు పెంచాలని, అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, దవాఖానల్లోని పడకలన్నింటినీ ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ టీకా వేసేలా వ్యాక్సిన్లను సిద్ధం చేయాలని.. ఇందుకోసం వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. జ్వరసర్వే ద్వారా మెడికల్‌ కిట్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.. కరోనా టెస్టుల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం సోమవారం నుంచే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుకిట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. కరోనా కట్టడే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని.. ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. వైద్యసిబ్బంది నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, బ్లాక్‌ ఫంగస్‌, వాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు.

బ్లాక్‌ ఫంగస్‌ బెడ్లను పెంచండి

బ్లాక్‌ ఫంగస్‌ రోగుల కోసం బెడ్ల సంఖ్యను పెంచడంతోపాటు, వ్యాధిని తగ్గించే మందులు ఎంత సంఖ్యలో అవసరమో అంచనా వేసి.. ఆ మేరకు ఆర్డర్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న ‘పోసకోనజోల్‌’ మందు స్టాక్‌ను తక్షణమే పెంచాలని సూచించారు. బ్లాక్‌ఫంగస్‌ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్ధప్రాతిపదికన నియమించుకోవాలని చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకోసం గాంధీలో 150, కోఠి ఈఎన్టీలో 250 కలిపి 400 బెడ్లు కేటాయించినట్టు వైద్యాధికారులు వివరించారు. స్పందించిన సీఎం ఆ బెడ్ల సంఖ్యను 1500కు పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో 1100 వరకు, జిల్లాల్లో 400 వరకు ఏర్పాటుచేయాలని చెప్పారు.

ఇతర రాష్ర్టాల వారికీ వైద్యం

‘పకరాష్ట్రాల నుంచి అటు కరోనా ఇటు బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం రోగులు తరలి వస్తున్నారు. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాస్తవమే. అయితే.. కరోనా చికిత్స విషయంలో నాలుగు కోట్లుగా కాకుండా పది కోట్లుగా అంచనా వేసుకోవాలె. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవాళ్లకు కూడా మనం చికిత్సను అందజేయక తప్పేటట్టు లేదు’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కరోనాను కంట్రోల్‌ చేయడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరొకటి లేదని.. ఎన్నికోట్లయినా ఖర్చుచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే అప్పు తెచ్చి అయినా కరోనా కట్టడి చేస్తామని స్పష్టంచేశారు. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ కట్టడిలో ప్రభుత్వ వైద్యవ్యవస్థకు ప్రైవేటు వైద్యరంగం, ఇతర రంగాలు మానవతా దృకృథంతో సహకరించాలని పిలుపునిచ్చారు.

ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాలి

‘రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, ఆరోగ్యరక్షణలో భాగంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతున్నది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాల్సి ఉన్నది. సత్ఫలితాలనిస్తున్న ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తూ లక్షణాలున్నవారికి మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అదే సమయంలో ప్రాథమిక వైద్యకేంద్రాల వద్దకు టెస్టుల వచ్చేవారందరికీ పరీక్షలు నిర్వహించాలి. అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తాం.. ఇంతవరకే పరీక్షలు చేస్తాం అనే నిబంధన ఉండకూడదు. పరీక్షల కోసం వచ్చేవారిలో అధికశాతం అత్యంత నిరుపేదలుంటారు కాబట్టి ఏ ఒకరినీ నిరాకరించకూడదు. ఇట్లా మందుల కిట్లను అందిస్తూ పరీక్షల సంఖ్య పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయాలి’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు.

50 లక్షలకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు

ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి, పీహెచ్‌సీలకు, అన్ని పరీక్షా కేంద్రాలకు కిట్ల సరఫరాను పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యకేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని.. ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని డీఎంహెచ్‌వోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి నియమాకాల ప్రక్రియ, దవాఖానల్లో మందులు తదితర మౌలిక వసతులపై నివేదిక తెప్పించాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతున్నదని, కొన్ని శాఖల ఖర్చు తగ్గుతున్నదన్న సీఎం.. ఖర్చు తగ్గే అవకాశాలున్న శాఖలను గుర్తించి.. పోలీస్‌, వైద్యారోగ్యశాఖలకు బడ్జెట్‌ను పెంచాలని సూచించారు. దీనిపై సమీక్ష నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు.

సత్పలితాలు సాధిస్తున్నాం

‘కరోనా పాజిటివ్‌ శాతాన్ని తగ్గించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నాం. అయితే కట్టడి శాతాన్ని ఇంకా పెంచేందుకు కృషిచేయాలి. మంచి కార్యక్రమాలను మనం ఎకడినుంచైనా చూసి తెలుసుకోవచ్చు. అందులో తప్పేంలేదు. ఢిల్లీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా కట్టడిచేస్తున్నట్టు తెలుస్తున్నది. అక్కడ చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలి. అవసరమైతే వైద్యబృందం వెళ్లి పరిశీలించి రావాలి. మహారాష్ట్ర కూడా కరోనాను కట్టడిలో మంచి ఫలితాలు సాధిస్తున్నది. ఇంకా ఏ ఏ రాష్ట్రాలు కరోనాను కట్టడి చేస్తున్నవి.. అందుకువారు అమలుపరుస్తున్న కార్యాచరణ ఏమిటో తెలుసుకోండి’ అని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. ‘తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాన్ని 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనాపై విజయం సాధించినవారమవుతాం. ఆ దిశగా వైద్యాధికారులు చర్యలను చేపట్టాలి’ అని సూచించారు. సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎంవో కార్యదర్శి, కొవిడ్‌ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ జితేందర్‌, వైద్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, కరోనా టాస్‌ఫోర్స్‌ మెంబర్లు జయేశ్‌రంజన్‌, వికాస్‌రాజ్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ రామకృష్ణారావు, రోనాల్డ్‌రాస్‌ తదితరులు పాల్గొన్నారు.

థర్డ్‌వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

రాష్ట్రంలో అన్ని దవాఖానల్లోని పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మార్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని 600 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాక్సిన్‌ సెకండ్‌డోస్‌ కోసం అధికసంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరాచేసేలా ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. ఒకవేళ వస్తే కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదురొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫంగస్‌పై దంగల్‌

ట్రెండింగ్‌

Advertisement