బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:23

మీకు అండగా ఉంటా మీరూ మా కుటుంబసభ్యులే

మీకు అండగా ఉంటా మీరూ మా కుటుంబసభ్యులే

  • కర్నల్‌ సంతోష్‌ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా
  • అవసరమైతే ఫోన్‌ చేయాలంటూ తన సతీమణి నంబర్‌ ఇచ్చిన సీఎం
  • ఉద్యోగ నియామక పత్రం అందజేత
  • బంజారాహిల్స్‌లో స్థలం అప్పగింత
  • కర్నల్‌ కుటుంబీకులతో కలిసి భోజనం
  • యోగక్షేమాలడిగిన సీఎం కుటుంబం
  • భావోద్వేగానికి గురైన సంతోషి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మీరూ మా కుటుంబసభ్యులే. కర్నల్‌ సంతోష్‌ను తిరిగి తీసుకురాలేం. కానీ, ఏ అవసరం వచ్చినా ఫోన్‌చేయమ్మా.. మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మీకు మేమున్నాం’ అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. కర్నల్‌ సంతోష్‌ బాబు భార్య సంతోషికి ధైర్యం చెప్పారు. గల్వాన్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్‌ సంతోష్‌ కుటుంబసభ్యులు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంతోషి కోరిక మేరకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. తన సతీమణి శోభ ఫోన్‌నంబర్‌ను ఆమెకు ఇచ్చారు. ‘ఏదైనా పనిలో ఉండి మీ మంత్రి జగదీశ్‌రెడ్డి వెంటనే ఫోన్‌ ఎత్తకపోవచ్చు. ఈ నంబర్‌కు ఫోన్‌చేయండి’ అం టూ ఒకటికి రెండుసార్లు చెప్పారు. సంతోషికి శిక్షణఇచ్చి హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ, పోస్టింగ్‌ బాధ్యతలను సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్‌కు అప్పగించారు. ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని కోరారు.

ఘన స్వాగతం.. ఆప్యాయ పలుకరింపు

సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు.. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యుల మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక వాహనాల్లో బుధవారం ప్రగతిభవన్‌కు తీసుకువచ్చారు. కర్నల్‌ కుటుంబానికి అక్కడ అరుదైన గౌరవం దక్కింది. సీఎం కేసీఆర్‌ స్వయంగా స్వాగతంపలికారు. ఆప్యాయంగా పలుకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులందరినీ పెద్దపెద్ద సోఫాల్లో కూర్చోబెట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికారులు మామూ లు కుర్చీల్లో వారికి ఎదురుగా కూర్చొని మాట్లాడారు. అనంతరం సంతోషితోపాటు ఆమె వెంట వచ్చిన 20మంది కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు.

రెండుగంటలు మాట్లాడి భరోసా

కర్నల్‌ కుటుంబసభ్యులతో సీఎం సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు శైలిమ దాదాపు రెండుగంటలు మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీరు కూడా మా కుటుంబసభ్యులేనని అనుకోండి. ఏ అవసరం వచ్చినా మొహమాట పడకండి. అన్నింటికీ మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ కూడా కర్నల్‌ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. 

కర్నల్‌ కుటుంబసభ్యుల భావోద్వేగం 

సీఎం కేసీఆర్‌ కుటుంబం మొత్తం అండగా ఉంటామని చెప్పడంతో కర్నల్‌ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆ భరోసా కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. భారత్‌- చైనా సరిహద్దు ఘర్షణలో మరణించిన దేశంలోని ఇతర ప్రాంతాల సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించడం, అందరూ సాయంచేయాలని కోరడం మరింత సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్‌, సైదిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ దీపికా యుగంధర్‌రావు, సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

711 గజాల స్థలం అప్పగింత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ బంజారాహిల్స్‌: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కర్నల్‌ సంతోష్‌ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం 711 గజాల స్థలాన్ని అప్పగించింది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి షేక్‌పేట మండలంలోని మూడు స్థలాలను చూపించి, ఒకటి ఎంచుకోవాలని సూచించారు. కర్నల్‌ కుటుంబసభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌14లో కేబీఆర్‌ పార్క్‌ ఎదురుగాఉన్న 711 గ జాల స్థలాన్ని అప్పగించారు. బుధవారం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ శ్వేతా మహంతి.. కర్నల్‌ భార్య సంతోషికి స్థలం పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌,  సంతోష్‌బాబు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


logo