శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 03:15:41

ఆరు నగరాలకు విజన్‌పై మోదీకి వివరించిన కేసీఆర్‌

ఆరు నగరాలకు విజన్‌పై మోదీకి వివరించిన కేసీఆర్‌

సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను సాధించి, ప్రజల ఆశీర్వాదంతో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తాను సీఎం హోదాలోకి వచ్చిన తొలినాళ్లలోనే దేశ సమగ్రాభివృద్ధి మీద కూడా తనదైన నిర్మాణాత్మకమై విజన్‌ను రూపొందించారు. తన ఆలోచనను ప్రధానమంత్రికి దాదాపు 45 నిమిషాలపాటు వివరించారు. దేశానికి అంతర్జాతీయంగా ముఖంలా ఉండే ఈ నగరాల అభివృద్ధిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కార్పొరేషన్లకు వదిలేయకుండా.. కేంద్రం స్థాయిలోనే ప్రత్యేక మండలి ఏర్పాటుతో సర్వతోముఖాభివృద్ధిని చేపట్టాలని హితవు పలికారు. కేంద్రం చేపట్టిన అమృత్‌, స్మార్ట్‌ సిటీ వంటి పథకాలతో చిన్నచిన్న పట్టణాలు అభివృద్ధిని సాధిస్తాయన్నారు. ఈ మహానగరాల అభివృద్ధి కోసం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖలో ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటుచేసి దానిద్వారా ప్రణాళికాబద్ధంగా పురోగమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధానమంత్రికి వివరిస్తే.. అంతా విన్నాక ‘చిట్టీ బిజావ్‌ (లేఖ పంపించండి)’ అని సింపుల్‌గా అనేసి వదిలించుకొన్నారు. ఇదీ కేంద్ర ప్రభుత్వ తీరు. అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కూడా ఇదే విజన్‌ను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యమైన అంశాలివి.


1.దేశంలోని ఆరు మెట్రో నగరాలు భారతదేశానికి ఒక ముఖం (ఫేస్‌ ఆఫ్‌ది కంట్రీ) లాంటివి.

2.భారతదేశానికి ఈ మహా నగరాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు (ఇంటర్నేషనల్‌ ఎలివేషన్‌) లభిస్తుంది. 

3.ఇలాంటి కీలకమైన మహా నగరాల అభివృద్ధిని ఆయా కార్పొరేషన్లకే వదిలివేయడం మంచిది కాదు. 

4.కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఈ ఆరు నగరాల అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. 

5.ఇందుకోసం ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటుచేయాలి. అందులో ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సభ్యులుగా నియమించాలి. వీరితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన నిపుణులను భాగస్వాములను చేయాలి.

6.ప్రతి ఏటా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆయా మహా నగరాలకు రూ.ఆరు వేల కోట్ల చొప్పున కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలి.

7.ఇలా ఏటా రూ.12 వేల కోట్లతో ఆయా మహా నగరాల్లో మౌలిక వసతులతోపాటు ఇతర అన్ని రంగాల్లోనూ అభివృద్ధిచేయాలి.

8.పట్టణీకరణ వేగంగా జరుగుతున్న దరిమిలా ఉపాధికోసం పట్టణాలకు వచ్చే నిరుపేదలతో మురికివాడలు పెద్దఎత్తున వెలుస్తున్నాయి. తద్వారా మహా నగరాల ముఖచిత్రం (లుక్‌) కూడా మారిపోతుంది. అపరిశుభ్రత బాగా పెరిగిపోతుంది. దీనికి తోడు నేరాలు కూడా పెరుగుతాయి. 

9.మహా నగరాల్ని దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి చేయడం వల్ల ఉపాధి కోసం వచ్చే వారికి మౌలిక వసతులను కల్పించడం సాధ్యమవుతుంది. తద్వారా మురికివాడలులేని మహా నగరాలు (స్లమ్‌ ఫ్రీ సిటీస్‌) సాకారమవుతాయి.