మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:56:44

ప్రతిఎకరాకు నీళ్లందేలా నిర్వహణ

ప్రతిఎకరాకు నీళ్లందేలా నిర్వహణ

  • విడుదల నుంచి పొలాలకు పారేదాకా సీఈ పర్యవేక్షణ 
  • ఆరుగురు ఈఎన్సీ, 17 మంది సీఈలతో జలవనరులశాఖ బలోపేతం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రాజెక్టుకు వచ్చే వరదను పర్యవేక్షించడం, నీటినిల్వ, కాలువలకు సరఫరా, ఎన్ని టీఎంసీలు ఇచ్చినది, ఎం త విస్తీర్ణంలో సాగువుతున్నది వరకు ఆ ప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్‌ బాధ్యత. ప్రాజెక్టు నుంచి విడుదలైన జలాలతో ఎన్ని చెరువులు నిండాయి? క్షేత్రస్థాయిలో ఎంత ఆయకట్టుకు సాగునీరందింది? వివరాలు చిన్ననీటివనరుల చీఫ్‌ ఇంజినీర్‌ వద్ద ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రస్తుతం సాగునీటి నిర్వహణలో గందరగోళం నెలకొన్నది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అశాస్త్రీయ విధానానికి స్వస్తి పలికేందుకే సీఎం కేసీఆర్‌ తెలంగాణ జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టుకు వరద నుంచి దాని పరిధిలో చివరి ఎకరాకు నీళ్లు పారేవరకు ఆ ప్రాజెక్టు సీఈ నిర్వహణలోనే కొనసాగేలా ప్రాదేశిక పరిధిని నిర్దేశించనున్నారు. దీనిద్వారా నీటి నిర్వహణలో స్పష్టతతోపాటు, ప్రతి బొట్టునూ సద్వినియోగంచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు అధికారులు పునర్వ్యవస్థీకరణపై మళ్లీ కసరత్తు చేశారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. అధికారులు తాజాగా రూ పొందించిన ప్రతిపాదనల ప్రకారం.. ఆరుగురు ఈఎన్సీలు, సుమారు 17 మంది క్షేత్రస్థాయి చీఫ్‌ ఇంజినీర్లతో తెలంగాణ జలవనరులశాఖ మరింత బలోపేతం కానున్నదని తెలుస్తున్నది.

ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రద్దు

తెలంగాణ జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఇరిగేషన్‌)ను ఈఎన్సీ-జనరల్‌గా అభివర్ణించనున్నారు. ఈఎన్సీ (పరిపాలన) పోస్టు అదేవిధంగా ఉంటుంది. అదనంగా ఈఎన్సీ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) పోస్టుకు సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారు. ప్రస్తుతంఉన్న మరో మూడు ఈఎన్సీ (కాళేశ్వరం రెండు, కరీంనగర్‌ ఒకటి) పోస్టులు అదేవిధంగా ఉంటాయి. దీంతో ఆరు ఈఎన్సీ పోస్టులకు అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ పోస్టులతోపాటు ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐడీసీ)ను రద్దుచేసేందుకు ప్రతిపాదించారు.


logo