e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home Top Slides తెలంగాణ దళిత బంధు

తెలంగాణ దళిత బంధు

తెలంగాణ దళిత బంధు
  • దళిత సాధికారత పథకానికి ముఖ్యమంత్రి నామకరణం
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక యూనిట్‌
  • రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు
  • పథకం అమలుపై సీఎం సుదీర్ఘ సమీక్ష
  • వెనువెంటనే ఉత్తర్వులు జారీచేసిన సీఎస్‌
  • ఎస్సీ సోదరుల కోసం సాధికారత పథకం
  • దశాబ్దాలుగా దెబ్బతిన్న మనిషికి, ఆత్మ విశ్వాస కల్పనే అసలు ఆదరువు.
  • నీకు తోడుగా నేనున్నాననే భరోసానే భవిష్యత్తు.

ఒక ఆశ
జీవితాన్ని నిలబెడుతుంది.
ఒక ఆసరా
బతుకుకు చేయూతనిస్తుంది.
ఒక అండ
కుటుంబాన్ని నిలబెడుతుంది.
ఒక తోడు
కష్టంతో కలబడే శక్తినిస్తుంది.
ఒక ఆశ్వాసన
ఊరికి ఊపిరి పోస్తుంది.
ఒక ప్రయత్నం
జాతి ప్రస్థానాన్నే మారుస్తుంది.

ఉమ్మడి పాలనలో పొలం కోసం కలవళపడిన మన రైతన్నను… మగ్గంపై ప్రాణాలుగ్గబట్టుకుని బతికిన మన నేతన్నను… కడకాలంలో కనికరించేవారు లేక కష్టపడ్డ వృద్ధులను.. అర్ధాకలితో పస్తులున్న పేదలను, వితంతువులను.. అనేక వర్గాల ఆర్తులను ఆప్యాయతతో ఆదుకున్న తెలంగాణ.. ఇప్పుడు మరో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుడుతున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలను ప్రారంభించిన కేసీఆర్‌ ప్రభుత్వం, మరో గేమ్‌ చేంజింగ్‌ స్కీమ్‌కు వేదిక కాబోతున్నది. దశాబ్దాలుగా అణచివేతకు గురైన దళితుల సాధికారత కోసం వినూత్న ప్రయోగం చేయబోతున్నది. ప్రాజెక్టు రిపోర్టులు, అనుమతులు, బ్యాంకులు, రుణాలు, లంచాలు, కమీషన్ల వంటి బాదరబందీలకు చెక్‌ పెడుతూ… దళిత కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు నేరుగా భారీగా ఆర్థికసాయం చేయబోతున్నది. లక్షలాది అన్నదాతల కడగండ్లు తీర్చిన రైతు బంధు తరహాలోనే, లక్షలాది దళిత సోదరుల కష్టాలను తీర్చేందుకు తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నది.

- Advertisement -

భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పటిమ గొప్పది. అయితే.. అనేక వివక్షల మూలంగా సామూహిక ఐక్యత లోపించి సామాజిక అభివృద్ధి ఆశించినంతగా జరుగట్లేదు. ఇది విచారకరం. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తెచ్చింది. అవసరమైన మేరకు నిధులను అందుబాటులో ఉంచుతుంది.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. తెలంగాణ దళిత బంధు అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఉండే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన దళితులను నిబంధనల మేరకు గుర్తించి, వారికి దళిత బంధు కింద ప్రభుత్వం నేరుగా సాయం అందజేయనున్నది. దళిత బంధు అమలులో వచ్చే సాదకబాధకాలు, అనుభవాలను అంచనా వేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో సాఫీగా ఈ పథకాన్ని కొనసాగించడం కోసం ముందుగా ఒక నియోజకవర్గంలో దళిత బంధును పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసే నియోజకర్గంగా హుజరాబాద్‌ను ఎంపిక చేసింది. ‘దళిత సాధికారత అమలు పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక అధికార యంత్రాంగం విధులు’ అనే అంశంమీద సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళితబంధు పథకం రూ.1200 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని సీఎం తెలిపారు. అయితే పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అదనంగా రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. పైలట్‌ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకుని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలుచేయడం అధికారులకు మరింత సులువవుతుందని వివరించారు. పైలట్‌ ప్రాజెక్టు అమలుకోసం కలెక్టర్లతోపాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారు. వారితో త్వరలోనే వర్‌షాప్‌ నిర్వహించనున్నారు.

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా..
‘తెలంగాణ దళితబంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాల్సి ఉన్నది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. వారు దళితబంధు పథకాన్ని మనసుపెట్టి అమలుచేయాలి. పూర్తిస్థాయి గణాంకాలు, సరైన సమాచారం లేకుండా ఏ ప్రభుత్వ పథకమైనా పరిపూర్ణంగా అమలుకాదు. ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వేను ఆధారం చేసుకుని, దళితబంధు పథకం అమలులో ముందుకుసాగాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. ‘మనం తిండి తింటున్నప్పుడు ఎంతైతే లీనమై రసించి భోజనం ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పనిచేస్తున్నప్పుడు ఎంతైతే దీక్ష కనబరుస్తామో.. దళితబంధు పథకం అమలులో అధికారులు అంతే తన్మయత్వంతో పనిచేయాలి’ అని స్పష్టంచేశారు. ‘తమ అభివృద్ధి గురించి, గత పాలకులు అవలంబించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడింది. వారిలో గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలిగిపోవాలి. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన అవసరం మనమీదున్నది. సరైన గైడెన్స్‌ఇస్తూ దళితబంధు పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. దళితబంధు పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని పేర్కొన్నారు.

దళిత కుటుంబాల ప్రొఫైల్‌
దళిత కుటుంబాల ప్రొఫైల్‌ను రూపొందించాలని, వారి జీవన స్థితిగతులను పొందుపరిచాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. దళిత సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని.. గ్రామీణ, సెమీఅర్బన్‌, పూర్తిఅర్బన్‌ అనే విభాగాలుగా వారి సమస్యలను విభజించాలని తెలిపారు. అందుకనుగుణంగా దళితబంధు పథకం ద్వారా అభివృద్ధి కార్యాచరణను అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పటిమ గొప్పది. అయితే.. అనేక వివక్షతల మూలంగా సామూహిక ఐక్యత ఆశించినంతగా లేకపోవడంతో సామాజిక అభివృద్ధి జరుగట్లేదు. ఇది విచారకరం. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తెచ్చింది. అవసరమైన మేరకు నిధులను అందుబాటులో ఉంచుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వవిప్‌ బాల సుమన్‌, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్‌రెడ్డి, కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సెక్రటరీలు స్మితాసబర్వాల్‌ , భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, డైరెక్టర్‌ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అమలులో మూడు ముఖ్యాంశాలు

తెలంగాణ దళితబంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయని సీఎం తెలిపారు. మొదటిది పథకం అమలుచేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా వేయడం, మూడోది లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటుచేయడమని సూచించారు. పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటుచేస్తారు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వారికి సహాయం అందుతుంది. ‘దళితబంధు లబ్ధిద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకుపోవడమే దళితబంధు పథకం ఉద్దేశం’ అని సీఎం తెలిపారు. తెలంగాణ దళితబంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని స్పష్టంచేశారు. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పని చేయాల్సి ఉంటుందన్నారు. అట్లాంటి చిత్తశుద్ది, దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. కులం, జెండర్‌, ఆర్థికం, తదితర పేర్లతో వివక్షకు గురిచేసి ప్రతిభావంతులను ఉత్పత్తిరంగానికి దూరంగా ఉంచడం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా మొత్తం జాతికే నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టంచేశారు. దళిత సాధికారత కోసం కృషి చేయడమంటే సమాజంలో వివక్షకు గురవుతున్న ఒక ప్రతిభావంతమైన వర్గాన్ని ఉత్పత్తిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేయడమేనని తెలిపారు.

బ్యాంక్‌ ఖాతాల్లోకి ఆర్థిక సాయం
దేశంలోని ఇతర కులాలు, వర్గాల్లో కూడా ఆర్థిక వివక్ష ఉన్నదని.. అయితే దళితులపై సామాజిక వివక్ష అనే అదనంగా ఉన్నదని, తరతరాలుగా దేశంలో పట్టి పీడించబడుతున్నదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. దళితులను ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి దూరంచేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్థితో ఉన్నదని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతును అభివృద్ధిపథంలో నడిపించిన విధంగా.. దళితబంధు పథకం ద్వారా రాష్ట్రంలో దళిత సాధికారతకోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కుటుంబం యూనిట్‌గా అర్హులైన, ఎంపిక చేయబడిన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం అందజేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని అభివృద్ధి చెందే వెసులుబాటును కల్పించాలని.. ఇటీవలి దళిత ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించిందని గుర్తుచేశారు. ఆ నిర్ణయం మేరకు దళారుల బాధలేకుండా రైతుబంధు తరహాలో దళితబంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయాన్ని జమచేస్తామని పునరుద్ఘాటించారు.

ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో దళితులను పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తెలంగాణ దళితబంధు పథకాన్ని అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ పథకానికి సంబంధించి జీవో ఎంఎస్‌ నంబర్‌ 6ను ఆదివారం రాత్రి విడుదలచేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన కుటుంబాలను ఎంపికచేసి పథకాన్ని అమలుచేయనున్నట్టు పేర్కొన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనే వెయ్యికోట్లతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించింది. షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం, అభివృద్ధి (ఎస్సీఎస్డీఎఫ్‌) కింద ఇప్పటికే కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాలతో సంబంధం లేకుండా తెలంగాణ దళితబంధును అమలుచేయనున్నట్టు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఈ పథకానికి ఎంపికైన ఒక్కో కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల చొప్పున నగదు సహాయాన్ని పూర్తి గ్రాంటు రూపంలో ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఈ పథకాన్ని ముందుగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తింపజేస్తామని.. ఇక్కడ పథకం అమలులో వచ్చే ఫలితాలను అధ్యయనంచేసిన తర్వాత రాష్ట్రమంతటా అమలుచేస్తామని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ దళిత బంధు
తెలంగాణ దళిత బంధు
తెలంగాణ దళిత బంధు

ట్రెండింగ్‌

Advertisement