గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 14:25:36

కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రానికి రెండు కండ్ల లాంటి వాళ్లు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రానికి రెండు కండ్ల లాంటి వాళ్లు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని బండరుపల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్న చెక్ డ్యాం కు మంత్రి పుష్పార్చన చేసి గంగమ్మకు నమస్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వాగుపై చెక్ డ్యాములు నిర్మించి ఉంటే ఈ పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమై ఉండేదని గత పాలకవర్గాల నిర్లక్ష్యం మూలంగా చెక్ డ్యాములు కూడా నిర్మించుకోలేకపోయమన్నారు. 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యే లోపు ఉమ్మడి జిల్లాలో విస్తారంగా చెక్ డ్యామ్ ల నిర్మాణాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వేలాదిగా చెక్  డ్యామ్ లు  నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా దేశంలోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేసిందని తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, మహారాష్ట్రల్లో ఎందుకు ఈ స్థాయిలో పంటల ఉత్పత్తి చేయలేదని ఆయన ఆయా పార్టీలను నిలదీశారు.

రాష్ట్రానికి కేసీఆర్, కేటీఆర్ లు రెండు కండ్ల లాంటి వారని, వారి హయాంలో తెలంగాణ మరింత శరవేగంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కెసీఆర్ కేటీఆర్ లను విమర్శించే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి సమీప భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి అంగుళం భూమిని సస్యశ్యామలం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


logo