బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 01:05:06

కేబీ తిలక్‌ అలుపెరుగని పోరాటయోధుడు

కేబీ తిలక్‌ అలుపెరుగని పోరాటయోధుడు

  • టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి
  • ‘కేబీ తిలక్‌ జ్ఞాపకాలు అనుభవాలు’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌/సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: కేబీ తిలక్‌ ప్రజల హక్కుల కోసం అలుపెరుగని పోరాటంచేసిన యోధుడు అని టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించి, స్వాతంత్య్రం సిద్ధించాక ప్రజల హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. ‘అభ్యుదయ దర్శకుడు కేబీ తిలక్‌ జ్ఞాపకాలు అనుభవాలు’ పేరిట సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రచించిన పుస్తకాన్ని బుధవారం ఘంటా చక్రపాణి జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమారంగంలోకి ప్రవేశించిన తిలక్‌ నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సమాజం మరచిపోలేని విధంగా, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా అనేక సినిమాలను నిర్మించారని గుర్తుచేశారు. ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, ఉయ్యాలజంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, ఛోటీ బహు, కంగన్‌ వంటి అపురూపమైన సినిమాలు రూపొందించిన ఆయన చలనచిత్రసీమలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే సినిమాలో ఆయన భూసంస్కరణలు తేవాలన్న సామ్యవాద ఆలోచనలు, భూమి, భుక్తికోసం సాగే విముక్తి పోరాటాల నేపథ్యంలో తిలక్‌ భూమికోసం చిత్రాన్ని తీశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్‌, ప్రముఖ రచయిత వంశీకృష్ణ, పుస్తక రచయిత వనం జ్వాలా నరసింహారావు, అమెరికానుంచి తిలక్‌ కుమారుడు కొర్షిపర లోకేశ్‌, రచయితలు ప్రసేన్‌, జూలూరు గౌరీశంకర్‌, ఎన్‌ రఘు పాల్గొన్నారు.logo