గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 04, 2020 , 15:13:15

మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మాజీ ఎంపీ కవిత

మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్ : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. మానవతా దృక్పథంతో స్పందించారు. అణగారిన వర్గాల పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ సెకండరీ స్కూల్ కు తొమ్మిది కంప్యూటర్లను అందించి తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన 77 ఏండ్ల వయసు గల బైలా గాబ్రియల్ సెయింట్ జోసెఫ్ పేరుతో పాఠశాలను నిర్వహిస్తున్నారు. 

1993 లో ప్రారంభమైన ఈ పాఠశాలలో అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ.. 27 ఏండ్లుగా  వేలాది మంది నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది గాబ్రియల్.అయితే కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలల్లో విద్యను బోధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్ లైన్ క్లాసులు ‌నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్ ల కొరత ఏర్పడింది. 

దీంతో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరుతూ మేరికా ఇసాబెల్ ట్వీట్ చేశారు. ట్వీట్ పై స్పందించిన మాజీ ఎంపీ కవిత  పిల్లల చదువులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను తొమ్మిది కంప్యూటర్ లను‌ అందించాలని‌ నిర్ణయించారు. 


కవిత సూచన మేరకు గురువారం తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్ లను అందించారు. ట్వీట్ చేసిన వెంటనే ‌మానవత్వంతో‌ స్పందించి కంప్యూటర్ లను అందించిన మాజీ ఎంపీ కవిత, మేరికా‌ ఇసాబెల్, బైలా గాబ్రియల్ కు ఉపాధ్యాయులు ‌కృతజ్ఞతలు తెలిపారు. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మాజీ ఎంపీ కవిత చేసిన సాయం పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయని మేరికా ఇసాబెల్ తెలిపారు. అలాగే అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న బైలా గాబ్రియల్ కు మాజీ ఎంపీ కవిత ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.  సెయింట్ జోసెఫ్ స్కూల్ కు భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. 


logo