శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 25, 2020 , 13:11:32

ఆర్టీఐ కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

ఆర్టీఐ కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌గా నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్‌ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. కట్టా శేఖర్ రెడ్డితో పాటు టీ న్యూస్‌ మాజీ సీఈవో మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్‌ శంకర్‌నాయక్‌, సోషల్‌ వర్కర్లు సయ్యద్‌ ఖలీలుల్లా, డాక్టర్‌ మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ను ఆర్టీఐ కమిషనర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. మోజాంజాహీ మార్కెట్‌లోని ఆర్టీఐ కార్యాలయంలో ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌ రాజాసదారాం.. వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఈ ఐదుగురు కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. కట్టా శేఖర్ రెడ్డి, నారాయణరెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ ను ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. వీరు నేటి నుంచి మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.


జర్నలిస్టులకు కరదీపిక కట్టా శేఖర్‌రెడ్డి

నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కట్టా శేఖర్‌రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రం పరిధిలోని మర్రిగూడెం. రైతు దంపతులైన కట్టా మల్లారెడ్డి, జానకమ్మ మూడోసంతానంగా 1961 డిసెంబర్‌ 5న జన్మించారు. మాడ్గులపల్లిలో పదోతరగతి పూర్తిచేసిన ఆయన నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, ఎన్జీ కాలేజీలో డిగ్రీ, నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ కాలేజీలో బీఈడీ చదివారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో ఎంఏ, లెనినిస్ట్‌ విద్యా తాత్వికతపై ఎంఫిల్‌ పూర్తిచేశారు. యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమనాయకుడిగానూ పలు బాధ్యతలు నిర్వహించారు. 1985లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ హ్యుమానిటీస్‌ కాలేజీ విద్యార్థిసంఘం అధ్యక్షుడిగా, సెనేట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

చదువు పూర్తయిన వెంటనే 1987లో ఉదయం దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా జర్నలిస్టు ప్రస్థానం మొదలుపెట్టారు. రెండేండ్ల తర్వాత పాత ఆంధ్రజ్యోతి పత్రికలో చేరి పదేండ్లకుపైగా వివిధహోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత రీడిఫ్‌.కామ్‌, వార్త పత్రికల్లోనూ కొద్దిరోజులు కొనసాగారు. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్రప్రభుత్వం రూపొందించిన వెలుగు ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌గా 2002లో పనిచేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక పునఃప్రారంభం నుంచి ఆరేండ్లపాటు ఏజే జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వందలమంది పాత్రికేయులకు శిక్షణ ఇచ్చా రు. తర్వాత రెండేండ్లు మహాటీవీలో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2010లో నమస్తే తెలంగాణ దినపత్రిక ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆయన వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరించారు. 2014 నుంచి నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. కట్టా సంపాదకత్వంలో వెలువడిన జర్నలిస్టు కరదీపిక పుస్తకం వర్ధమాన, యువ జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.

ఉద్యమంలో క్రియాశీలక పాత్ర

ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల ద్వారా కట్టా శేఖర్‌రెడ్డి ఎన్నోవ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. బొమ్మా-బొరుసు, బయోగ్రాఫ్‌ కాలమ్‌ల పేరుతో ప్రముఖులు, రాజకీయసందర్భాలను విశ్లేషించారు. కట్టా-మీఠా, మాటకుమాట శీర్షికల ద్వారా ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకశక్తులపై పదునైన వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. తెలంగాణ నీటి వాటాలతోపాటు జల వనరుల ఆవశ్యకతపై ‘నదుల కథ’ పుస్తకాన్ని ప్రచురించారు. వార్త ల సేకరణలో పలువురు జర్నలిస్టులు ఎదుర్కొన్న అనేక సంఘటనల అనుభవాల సంకలనంగా ‘వార్తల వెనుక కథ’ పుస్తకాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తితో కలిసి రచించారు.

విస్తృత విషయ పరిజ్ఞానం నారాయణరెడ్డి సొంతం

మైడ నారాయణరెడ్డి 1970లో ప్రస్తుత సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ముబారస్‌పూర్‌లో వ్యవసాయకుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టాపొందిన ఆయన 1995లో వార్త దిన పత్రికలో ట్రైనీ సబ్‌ఎడిటర్‌గా జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాత రిపోర్టర్‌గా మారి.. సీనియర్‌ రిపోర్టర్‌గా ఎదిగారు. 2003లో ఆంధ్రజ్యోతిలో సీనియర్‌ కరస్పాండెంట్‌, చీఫ్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. రాజకీయ, శాసనసభ, నీటిపారుదల, విద్యా, శాంతిభద్రతలు రంగా ల్లో గొప్ప విషయపరిజ్ఞానం కలిగిన వ్యక్తి నారాయణరెడ్డి. 2007 నుంచి 2008 వరకు సాక్షి దినపత్రికలో చీఫ్‌రిపోర్టర్‌గా పనిచేశారు. 2008లో హెచ్‌ఎం టీవీలో చీఫ్‌రిపోర్టర్‌, బ్యూరో ఇంచార్జ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 నుంచి టీన్యూస్‌ సీఈవో, ఎడిటర్‌గా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు తెలంగాణ ప్రెస్‌అకాడమీ సభ్యుడిగా జర్నలిస్టుల సంక్షేమంకోసం కృషిచేశారు. ట్రైనీ సబ్‌ఎడిటర్‌ నుంచి సీఈవో, ఎడిటర్‌ స్థాయికి ఎదిగిన నారాయణరెడ్డి దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో పనిచేశారు.

గిరిజన విద్యార్థి నాయకుడు గుగులోతు

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామం భోజ్యతండాకు చెంది న గుగులోతు శంకర్‌నాయక్‌ 1986 జూలై 10న జన్మించారు. తల్లిదండ్రులు భాగ్యానాయక్‌, సాలమ్మది నిరుపేద గిరిజన కుటుంబం. శంకర్‌నాయక్‌ చిన్నతనం నుంచి కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. విద్యార్థిసంఘ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. గిరిజన విద్యార్థి సంఘం స్థాపించి గిరిజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడారు. ఓయూ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సేవాలాల్‌ మహరాజ్‌ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 

మైనార్టీ నాయకుడు అమీర్‌ హుస్సేన్‌ 

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ 1969 డిసెంబర్‌ 21న జన్మించారు. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ చేశారు. కొన్నేండ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. పేదవారినుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా న్యాయసహాయం అందజేస్తూ సామాజిక సేవచేస్తున్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ నిర్వహించి కుటుంబాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తున్నారు. వీటితోపాటుగా న్యాయపరమైన అంశాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన, ఉచిత వైద్యశిబిరాలు, ఇతర సామాజికసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు హక్కులు, బాలకార్మికుల విముక్తికి కృషిచేశారు.

ఎల్‌ఎల్‌బీ పట్టభద్రుడుసయ్యద్‌ ఖలీలుల్లా

హైదరాబాద్‌లోని ఆగాపురాకు చెందిన సయ్యద్‌ ఖలీలుల్లా 1961లో జన్మించారు. తండ్రి ఎస్సార్‌ రహీం. ఖలీలుల్లా 1989లో గుల్బర్గా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టభద్రులయ్యారు. అనంతరం హైదరాబాద్‌ సిటీ క్రిమినల్‌ కోర్టులో జీవితకాల సభ్యత్వం పొందారు. ప్రస్తుతం ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ రిక్రూటింగ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్స్‌కు లీగల్‌ అడ్వయిజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 
logo