శనివారం 11 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 03:42:59

తెలంగాణ తల్లికి రుద్రాక్ష మాల

తెలంగాణ తల్లికి రుద్రాక్ష మాల

  • అరుదైన పంటలకు నెలవు
  • సమీకృత సాగులో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
  • వ్యవసాయక్షేత్రంలో నేపాల్‌ రుద్రాక్ష చెట్ల పెంపకం
  • లిచీ, అవకాడో, లవంగాలు, యాలకులు కూడా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని భౌగోళిక, ప్రాంతీయ వైవిధ్యం పంటలకు కూడా వ్యాపించింది. తెలంగాణలోని నేలలు అరుదైన పంటలకు నెలవుగా మారుతున్నాయి.  రైతు లు, ఔత్సాహికులు ఇప్పటిదాకా ఇతర ప్రాంతాలకే పరిమితమైన పంటలను తెలంగాణలోనూ పండిస్తున్నారు. తమకు మద్దతు ఇస్తే ఏ పంటనైనా పండించి చూపిస్తామని నిరూపిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదర్శమని పేర్కొంటున్నారు. సనత్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన సమీకృత వ్యవసాయంలో భాగంగా అరుదైన మొక్కల్ని సేకరించి తన వ్యవసాయక్షేత్రంలో పండిస్తున్నారు. నేపాల్‌లో పండే రుద్రాక్షలో నాణ్యమైన రకాలను పెంచుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లోని ‘లిచీ’ వంటి శీతకాల పండ్ల తోటలను విజయవంతంగా సాగుచేస్తున్నారు. లవంగాలు, యాలకులు, లిచీ, అవకాడో, స్టార్‌ ఫ్రూట్‌ వంటి ఖరీదైన, అరుదైన పంటలను సాగు చేస్తూ కొత్త తరహా వ్యవసాయ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. వీటికి సేంద్రియ సాగును జోడించి  వాటి నాణ్యతను మరింత పెంచుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఉన్న ఈ సాగు విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 

3 లిచీ మొక్కల నుంచి 150 కిలోల దిగుబడి

నాలుగేండ్ల క్రితం బెంగళూరులోని ఓ ఉద్యాన ప్రదర్శనలో ప్రసూన లిచీ మొక్కలను పట్టుకొచ్చి తోటలో నాటారు. వ్యవసాయక్షేత్రంలో 3 లిచీ మొక్కలు మామిడి చెట్లకంటే ఎక్కువ విస్తీర్ణంలో పెరిగాయి. మూడేండ్ల నుంచి ఏటా 150 కిలోల దిగుబడినిస్తున్నాయి. ఇక్కడి లిచీ పండ్లు యూపీలో పండే వాటికంటే ఎక్కువ రుచికరంగా ఉంటున్నాయి.

73 రకాల మామిడి చెట్లు

కేరళకే పరిమితమైన యాలకులు, లవంగాలు, బిర్యాని ఆకు వంటి తోటలను కూడా ప్రసూన తన వ్యవసాయక్షేత్రంలో సాగుచేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వీటిని పెంచుతున్నారు. ఇంట్లోకి వాడుకునే పరిమాణంలో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఉద్యాన ప్రదర్శనలో ఆమె అవకాడో మొక్కలను కొని నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి దిగుబడినిస్తున్నాయి. వీటితో పాటు ప్రసూన తన వ్యవసాయక్షేత్రంలో 73 రకాల మామిడి మొక్కలను సాగు చేస్తూ తెలంగాణ భూముల్లో అన్ని  రకాల పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు. 

వ్యవసాయంపై అభిమానంతోనే..

వ్యవసాయం మీదున్న అభిమానంతో దేశంలో ఎక్కడ ఉద్యాన ప్రదర్శనలు జరిగినా వెళ్తాను. అరుదైన మొక్కలను సేకరిస్తాను. స్వతహాగా అగ్రి ఎకానమిస్ట్‌ కావడంతో వ్యవసాయాన్ని అలవాటుగా మార్చుకున్నా. రుద్రాక్షలు పండించడం శివుడి కృపగా భావిస్తున్నా. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ అనుకూల నిర్ణయాలతో యువత వ్యవసాయరంగం వైపు మళ్లుతున్నారు.

- కాట్రగడ్డ ప్రసూన, మాజీ ఎమ్మెల్యే

ఒక్క చెట్టు నుంచి 10 కిలోల రుద్రాక్షలు

వ్యవసాయం అంటే మొదటి నుంచి ఆసక్తి ఉన్న కాట్రగడ్డ ప్రసూన ఏదైనా కొత్తగా చేయాలని అనుకొనేవారు. అందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ఉద్యాన ప్రదర్శనలకు వెళ్లేవారు. తొమ్మిదేండ్ల క్రితం బెంగళూరుకు వెళ్లినప్పుడు ఆమె అక్కడి నర్సరీ నుంచి 3 రుద్రాక్ష మొక్కలను  తీసుకొచ్చారు. వాటిని దుండిగల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో నాటారు. వాటిల్లో ఓ రుద్రాక్ష చెట్టుకు ఏడాదికి 10 కిలోల కాయలు కాస్తున్నాయి. నేపాల్‌లో కూడా తక్కువగా కాసే అరుదైన రుద్రాక్షలను ఈ క్షేత్రంలో పండిస్తున్నారు. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు రుద్రాక్ష చెట్లు పూతకు వస్తాయి. మే నుంచి మూడు నెలల పాటు కాయలు కాస్తాయి. అనంతరం పండ్లుగా మారుతాయి. పండు రుద్రాక్షలు ఆంజీర్‌లాగా కన్పిస్తాయి. ఈ సమయంలో అవి సువాసనలు వెదజల్లుతాయి. శివుడి ప్రతిరూపంగా భావించే ఈ చెట్ల పక్కన ప్రసూన బిల్వచెట్టును కూడా పెంచారు. logo