ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:06

‘డబుల్‌' ఇండ్ల పేరిట వసూళ్లు

‘డబుల్‌' ఇండ్ల పేరిట వసూళ్లు

  • నకిలీ ఉద్యోగికి దేహశుద్ధి చేసిన కసాన్‌పల్లి వాసులు

చేగుంట, జనవరి 5: డబుల్‌ బెడ్రూం ఇండ్లకుదరఖాస్తుల పేరిట ఓ వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయగా పసిగట్టిన స్థానికులు అతణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూర్‌ గ్రామానికి చెందిన కమ్మరి వెంకటేశం మంగళవారం చేగుంట మండలంలోని కసాన్‌పల్లికి వచ్చాడు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు  కోసం ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, పాస్‌పోర్టుసైజ్‌ ఫొటో తీసుకురావాలని మైకులో ప్రచారం చేశాడు. నిజమేననుకున్న పలువురు పంచాయతీ కార్యాలయం వద్ద వెంకటేశంను కలిశారు. దాదాపు 24 మంది దరఖాస్తు చేసుకున్నారు. పది మంది వద్ద రూ.250 చొప్పున వసూలు చేశాడు. దీనిపై అనుమానం వచ్చి పలువురు నిలదీయగా  తనపై అధికారులు అలాగే చెప్పారని సమాధానమిచ్చాడు. దీంతో సర్పంచ్‌.. చేగుంట తాసిల్దార్‌, ఎంపీడీవోకు సమాచారమిచ్చారు. తాము ఎవరినీ పంపలేదని చెప్పడంతో సదరు వ్యక్తి నకిలీ ఉద్యోగిగా గుర్తించి పంచాయతీ కార్యాలయంలోనే బంధించి చితకబాదారు. అతని వద్ద ఉన్న డైరీని పరిశీలించగా, గతంలోనూ బంగ్లా వెంకటాపూర్‌లో ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసినట్టు తేలింది. చేగుంట పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


logo