ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 02:05:32

కార్తీక వైభోగం

కార్తీక వైభోగం

ఆలయాలకు పోటెత్తిన భక్తజనం

తెల్లవారుఝాము నుంచే పుణ్యస్నానాలు

వేములవాడలో వైభవంగా జ్వాలాతోరణం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ, యాదాద్రి, భదాద్రి, ధర్మపురి, కాళేశ్వరం క్షేత్రాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. పౌర్ణమిని పురస్కరించుకొని వేకువజామునే నదీ స్నానాలు ఆచరించిన జనం.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వతహాగా అభిషేక ప్రియుడైన శివుడిని కార్తీక పౌర్ణమి రోజు ఆరాధిస్తే మరింత పరమానంద భరితుడవుతాడన్న నమ్మకంతో భక్తులు ఆలయాలకు బారులుతీరారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని 50 వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారు. సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జ్వాలాతోరణం కన్నులపండువగా సాగింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణి పంచ సహస్ర దీపాలతో కాంతులీనింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేసిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేశారు. నందీశ్వరుడి విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. వీటితోపాటు రామప్ప, కోటగుళ్లు తదితర ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసింది. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సామూహికంగా దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం అర్చకులు స్వామివారికి కలశాభిషేకం నిర్వహించారు. 

శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు  

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్నేండ్లుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని ఆమె పేర్కొన్నారు.