మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 17:58:46

యాదాద్రికి కార్తీక శోభ

యాదాద్రికి కార్తీక శోభ

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం తొలిరోజుతో పాటు సోమవారం కావడంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు వేకువజామునే కొండపైన దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రత మండపం కిటకిటలాడింది.

స్వామివారి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి కొండపైగల వ్రత మండపం, పాతగుట్టలో గల వ్రత మండపంతోపాటు పక్కనే ఉన్న సత్రంలో సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.