శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 02:50:03

వడ్డీ వ్యాపారంలా కేంద్రం వైఖరి

వడ్డీ వ్యాపారంలా కేంద్రం వైఖరి

  • హాస్యాస్పదంగా మోదీ సర్కారు ప్యాకేజీ
  • కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ కర్నె ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నరేంద్రమోదీ సర్కారు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ హాస్యాస్పదంగా ఉన్నదని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. ఓ పక్క ఆకలితో చస్తుంటే.. కొంచెం ఆగు బిర్యానీ తినిపిస్తామన్నట్లు ప్యాకేజీ కనిపిస్తున్నదని విమర్శించారు. ఒకవిధంగా కేంద్రం వడ్డీ వ్యాపారిగా వ్యవహరిస్తున్నదన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ పలు విలువైన సూచనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిచేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో కర్నె ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణతోపాటు ఏ రాష్ట్రానికి కూడా చేసిందేమీ లేదని చెప్పారు. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు తప్ప కేంద్రం ఇచ్చిందేమీ లేదని తెలిపారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వ్యవహారం ఆర్థిక నిపుణులకు సైతం అర్థం కావటం లేదన్నారు.

బీజేపీ నేతలకు కూడా అర్థంకాక తలలు పట్టుకొంటున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రాలకు నగదును కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను బట్టి ఆ నగదును ఉపయోగించుకుంటాయని తెలిపారు. గతంలో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలిపారని, సోషల్‌మీడియాలో ప్రధానిపై విమర్శలు చేయడం తగదని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరిది సంకుచిత స్వభావమో కిషన్‌రెడ్డి ఆలోచించుకోవాలన్నారు. విద్యుత్‌రంగాన్ని తన గుత్తాధిపత్యంలోకి తెచ్చుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. విద్యుత్‌ సంస్కరణలపై తమతో కలిసొచ్చే రాష్ట్రాలతో కలిసి పోరాడుతామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి అనుకూలమో కాదో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమచేస్తున్నట్టే.. మన దేశంలోనూ చేయాలని సూచించారు. మోడీ ఫ్యూడల్‌ విధానాలను గట్టిగా వ్యతిరేకించి తీరుతామని కర్నె ప్రభాకర్‌ స్పష్టంచేశారు. 


logo