గురువారం 16 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 19:12:00

రానున్న రోజుల్లో అద్భుత నగరంగా కరీంనగర్‌

రానున్న రోజుల్లో అద్భుత నగరంగా కరీంనగర్‌

కరీంనగర్‌: స్మార్ట్‌ సిటీ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్‌ ప్రెస్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ హోదాకు అర్హత లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నగరం మీద ఉన్న ప్రేమతో కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటీ హోదా వచ్చిందన్నారు. బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత 19 నెలలకు హైదరాబాద్‌లో మొదటి సమావేశం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కొత్తగా 5 పనులకు పరిపాలన పరమైన ఆమోదం లభించింది. కేసీఆర్‌ ఆమరణ దీక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్‌ చేసిన అలుగునూర్‌ వద్ద అద్భుత ఐలాండ్‌ నిర్మిస్తాం అన్నారు. 

మానేరు రివర్‌ ఫ్రంట్‌కు తోడుగా కుడి వైపు నాలుగున్నర కిలోమీటర్ల నిడివిలో మానేరు రివర్‌ బాండ్‌ అభివృద్ధి చేస్తాం, దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తాం అన్నారు. మానేరు నుంచి చేగుర్తి వరకు 5 చెక్‌ డ్యాములు నిర్మిస్తామని తెలిపారు.  మూడు జోన్లలో 24 గంటల పాటు తాగు నీటి సరఫరాకు ప్రణాళిక రూపకల్పన, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం చేపడతామన్నారు. కరీంనగర్‌లో ఈ బస్‌ నడిపేందుకు డీపీఆర్‌ రూపకల్పన, చారిత్రక కట్టడాల రక్షణకు 3.2 కోట్లతో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సాలీడ్‌ వెస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ కోసం 66 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 

ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కోసం రూ. 5.6 కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్మార్ట్‌ సిటీ పనుల్లో వరంగల్‌ కంటే కరీంనగర్‌ ముందంజలో ఉందన్నారు. కరోనా కట్టడిలో నగరపాలక సంస్థ చర్యలు భేష్‌ అని కేటీఆర్‌ కొనియాడినట్లు తెలిపారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన డంప్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం అని, సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ధ్వారా చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. యూజీడీ పనులను పూర్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారని గుర్తు చేశారు.


logo