ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 21:16:11

ఎల్‌ఎండీలో దూకిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు

ఎల్‌ఎండీలో దూకిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు

కరీంనగర్‌: కుటుంబ కలహాలతో కలత  చెందిన ఓ 90 ఏండ్ల వృద్ధురాలు మానేర్‌ డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నం  చేయగా.. లేక్‌పోలీసులు ఆమెను కాపాడి కుమారుడికి  అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడకు చెందిన నరికుల్ల లచ్చవ అనే వృద్ధురాలు కోడలు పెడుతున్న బాధలు భరించలేక మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నది. దాంతో వేములవాడ నుంచి మానేరు డ్యాం వరకు నడుచుకొంటూ వచ్చింది. నీటిలో దూకగానే వెంటనే స్పందించిన లేక్‌ పోలీసులు.. ఆమెను రక్షించి బయటకు లాగారు. తండ్రి మరణంతో కొడుక్కు ప్రభుత్వ  ఉద్యోగం  వచ్చిందని, ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా  కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో  పనిచేస్తున్నడని పోలీసులకు తెలిపింది. తనకు వచ్చే రూ.10 వేల పెన్షన్‌ను కూడా కోడలు తీసుకొని తనను ఇబ్బందులపాలు చేస్తున్నదని పోలీసుల ఎదుట వాపోయింది. దాంతో పోలీసులు ఆమె కుమారుడిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిని అప్పగించారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి వారిని పంపించారు.


logo