మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:51:19

కరీంనగర్‌ సమరం!

కరీంనగర్‌ సమరం!

  • కరోనాపై సైనికుల్లా ప్రభుత్వ సిబ్బంది పోరాటం .. 
  • మూడురోజుల్లో 1,27,245 మందికి స్క్రీనింగ్‌
  • విదేశాల నుంచి వచ్చిన 371 మందికి స్టాంప్‌.. 
  • ఇంట్లోనే స్వీయ నిర్బంధం.. పోలీసుల నిఘా

కరీంగనర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణపోరులో కరీంనగర్‌ ఆదర్శంగా నిలుస్తున్నది! రాష్ట్రంలో గరిష్ఠంగా ఒకేసారి పదికరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డ ఈ నగరం, దాన్ని కట్టడి చేసేందుకు యుద్ధమే చేస్తున్నది! ఇండోనేషియా నుంచి వచ్చి కరీంనగర్‌లో బసచేసిన పదిమంది మతప్రచారకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేందుకు కరీంనగర్‌ ప్రజలు స్వీయనిర్బంధంతో అడ్డుకొంటున్నారు. కరీంనగర్‌ నుంచి కరోనాను తరిమికొట్టాలన్న సీఎం కేసీఆర్‌ మాటలను స్ఫూర్తిగా తీసుకొన్న జిల్లాలోని అన్ని ప్రభుత్వవిభాగాల సిబ్బంది సైనికుల్లా మారి ఆ రక్కసిపై పోరాటం చేస్తున్నారు. 

మంత్రి గంగుల కమలాకర్‌ నిత్యం నగరంలోని గల్లీల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సిబ్బందిలో స్ఫూర్తి నింపుతున్నారు. 700 మంది పారిశుద్ధ్య కార్మికులతో శానిటేషన్‌ పనులుచేపట్టారు. మూడురోజుల్లో 33, 435 గృహాల్లో వంద వైద్య బృందాలు సర్వేచేసి, 1,27,245 మందికి స్క్రీనింగ్‌ చేశాయి. ఇండోనేషియా మత ప్రచారకులతో సన్నిహితంగా మెలిగినట్టు గుర్తించినవారిలో శనివారం 37 మంది రక్తనమూనాలు గాంధీ దవాఖానకు పంపించారు. 31 వరకు రోజుకు స్క్రీనింగ్‌ కొనసాగిస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా 

విదేశాల నుంచి కరీంనగర్‌ జిల్లాకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య 371 మంది వచ్చారని ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు గుర్తించాయి.   వీరి ఎడమచేతి మణికట్టుపై ఇండిబుల్‌ ఇంక్‌(ఎన్నికలపుడు వేసే సిరా)తో స్టాంపు వేయడంతోపాటు జియోట్యాంగింగ్‌ చేశారు. ప్రతిరోజూ పోలీసు అధికారులు పెట్రోలింగ్‌చేస్తూ వారి కదలికలపై నిఘాపెట్టారు. 20వ తేదీనాటికి కరీంనగర్‌లో 400 ఐసొలేటెడ్‌ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్ర దవాఖానలో హెల్ప్‌డెస్క్‌తో పాటు ట్రైఏజ్‌ వార్డు శనివారం నుంచి అమల్లోకి రానున్నది. 31వ తేదీ వరకు ఫంక్షన్‌హాల్స్‌లో వివాహాలకు వందమందికి మించి లేకుండా, మందిరాలు మసీదులు, చర్చిల్లో గుమికూడకుండా ఆంక్షలు విధించారు. కరంటు బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని విద్యుత్‌శాఖ కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తితో రెండురోజులుగా కరీంనగర్‌లో అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తున్నది. మెజార్టీ ప్రాంతాల్లో ప్రజలు స్వీయనిర్బంధం చేసుకొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. 


logo
>>>>>>