శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 16:56:59

కనిమెట్ట - జంగమాయపల్లి బ్రిడ్జిని మంజూరు చేయాలని మంత్రికి వినతి

కనిమెట్ట - జంగమాయపల్లి బ్రిడ్జిని మంజూరు చేయాలని మంత్రికి వినతి

మహబూబ్ నగర్ : జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట- జంగమాయపల్లి బ్రిడ్జిని మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావును కోరారు. కాగా, ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కనిమెట్ట జంగమాయపల్లి బ్రిడ్జి లేనందువల్ల వర్షాల ప్రభావంతో వాగు ఉదృతంగా ప్రవహించడం వల్ల కనిమెట్ట- జంగమాయపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు పడవలో ప్రయాణం చేసిన అంశంపై  ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించారు.

 సీఎం ఈ అంశంపై స్పందించి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా మంత్రి హరీశ్‌ రావును కలిసి బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును  మంజూరు చేసి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించి పనులు  ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.