నాన్నా.. మళ్లీ ఫోన్చేస్తా

- అంతలోనే సిడ్నీలో రోడ్డు ప్రమాదం
- కందనూలు యువతి రక్షిత బ్రెయిన్‌డెడ్
- స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఘటన
- కుటుంబ అంగీకారంతో అవయవదానం
వంగూరు (నాగర్‌కర్నూల్)/ బడంగ్‌పేట (హైదరాబాద్), జనవరి 2: ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు మోసుకొని చదువుకొనేందుకు విదేశాలకు వెళ్లిన ఆ యువతి లక్ష్యం నెరవేరకముందే రోడ్డుప్రమాదంలో కన్నుమూసింది. చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగంలో చేరి కూతురు ఉన్నతస్థాయికి ఎదుగుతున్నదనుకున్న తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరైంది. రోజూలాగే ఆరోజు ఇంటి కి ఫోన్ చేసిన ఆ యువతి మంచిగా చదువుకుంటున్నానని.. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత కొన్ని గంటలకే రోడ్డుప్రమాదం బారిన పడటంతో అవే చివరి మాటలయ్యాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన రోడ్డుప్రమాదంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రక్షిత కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొన్నది. వంగూరు మండలం డిండి చింతపల్లికి చెందిన మల్లేపల్లి వెంకట్‌రెడ్డి, అనిత దంపతులకు కూతురు రక్షిత(22), కుమారుడు శ్రేయన్రెడ్డి ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వెంకట్‌రెడ్డి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని డీఆర్డీవోలో పనిచేస్తున్నారు. చాలాకాలం కిందట బడంగ్‌పేటలోని కేశవరెడ్డినగర్లో స్థిరపడ్డారు.
పెద్ద కుమార్తె రక్షిత చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. పదోతరగతి లో పది పాయింట్లకు పది సాధించింది. ఆ తర్వాత ఇంటర్‌లోనూ మంచి మార్కులతో పాసయ్యింది. బీటెక్ చేసేందుకు 2019 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లింది. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. రక్షిత డిసెంబర్ 31న (భారత కాలమానం ప్రకారం) రాత్రి పదకొండున్నర సమయంలో తన స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అక్కడి దవాఖానలో చేర్పించగా బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో డిండి చింతపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
8న మృతదేహం రాక
బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా నిర్ధారించిన వైద్యులు అవయవ దానం చేస్తే పది మందికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని సూచించారు. ఈ విషయాన్ని అక్కడి తెలుగు అసోసియేషన్ వారు రక్షిత తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అవయవదానానికి అంగీకరించారు. వైద్యులు అవయవాలను సేకరించారు. ఈ నెల 8న రక్షిత మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సిడ్నీలోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారని బంధువులు తెలిపారు. రక్షిత మరణంతో నాగర్‌కర్నూల్ జిల్లా చింతపల్లిలో, ప్రస్తుతం ఉంటున్న హైదరాబాద్‌లోని కేశవరెడ్డినగర్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
ఫోన్ చేసిన గంటల్లోనే..
తల్లిదండ్రులతో నిత్యం ఫోన్లో మాట్లాడే రక్షిత ప్రమాదానికి గురైన డిసెంబర్ 31వ తేదీన ఉదయం (సిడ్నీలో మధ్యాహ్నం) మాట్లాడింది. తాను మంచిగా చదువుకుంటున్నానని, తీరిక సమయంలో మళ్లీ ఫోన్ చేస్తానని నాన్నకు చెప్పింది. అదే చివరి మాటలు కావడంతో వాటినే తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
నా బిడ్డ పదిమందికి ప్రాణం పోస్తున్నది
నా బిడ్డ రక్షిత చనిపోయినా పది మందికి ప్రాణం పోస్తున్నది. దేశం కోసం సైనికుడిగా సేవ చేశా. నా బిడ్డ చదువుకొని గొప్ప స్థానంలో ఉండాలని ఆశించా. దేశానికి, రాష్ర్టానికి మంచి పేరు తెస్తుందనుకున్నా. చిన్నతనం నుంచి కష్టపడి చదువుకునేది. రోడ్డు ప్రమాదంలో ఇలా చనిపోతుందని ఊహించలేకపోయా. మా కలలన్నీ కన్నీళ్లయ్యాయి - తండ్రి మల్లేపల్లి వెంకట్‌రెడ్డి