మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 26, 2020 , 07:07:45

హైదరాబాద్ లో రిసెప్షన్ కు వచ్చారు..కానీ..

హైదరాబాద్ లో రిసెప్షన్ కు వచ్చారు..కానీ..

హైదరాబాద్ : కూతురు వివాహం జరిపారు. డిన్నర్‌కు పెండ్లి కొడుకు నివాసానికి వచ్చారు. లాక్‌డౌన్‌తో పెండ్లివారు దిక్కుతోచని స్థితిలో మూడు రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ వారిని వారి ఊరికి పంపారు. కామారెడ్డి జిల్లా గంభీరావ్‌పేటకు చెందిన నారాయణ, ఎల్లవ్వల కుమార్తె భార్గవి వివాహం వారాసిగూడకు చెందిన ఎల్లయ్య, యాదమ్మ కుమారుడు సంతోష్‌తో ఈనెల 20న కామారెడ్డిలో జరిగింది. ఈనెల 22న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నాన్‌టీచింగ్‌ ఫంక్షన్‌హాల్‌లో రిసెప్షన్‌ జరుగాల్సి ఉండగా సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు రద్దుచేసుకున్నారు. 

వారాసిగూడలోని వరుడి నివాసం వద్దనే రిసెప్షన్‌ జరుపుకోవడానికి వదువు తరపున 30 మంది వివాహం జరిగిన రోజునే వారాసిగూడకు చేరుకున్నారు. ఈనెల 22న వరుడి నివాసంలోనే రిసెప్షన్‌ జరుపుకున్నారు. అదేరోజు జనతా కర్ఫ్యూ ఉండడంతో 30 మంది కామారెడ్డి వాసులు 23న ఉదయం కామారెడ్డి వెళ్లాలనుకున్నారు. అయితే 22న సాయంత్రమే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వారంతా వారాసిగూడలోని వరుడి నివాసం వద్దే ఉండిపోయారు. కామారెడ్డికి వెళ్లేందుకు ట్రావెల్స్‌కు చెందిన వాహనాలు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిండి. కాగా బుధవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ కార్యాలయంలో ఉండగా వరుడు సంతోష్‌ నేరుగా ఆయనను కలిసి సమస్యను వివరించాడు. 

వరుడు పసుపు బట్టలతో వచ్చి విజ్ఞప్తి చేయడంతో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అప్పటికప్పుడు తనకు తెలిసిన ట్రావెల్స్‌కు చెందిన బస్సును మాట్లాడి కామారెడ్డికి వెళ్లాల్సిన వారందరినీ బస్సులో పంపించారు. దారిమధ్యలో పోలీసులు ఆపకుండా తన లెటర్‌ను ఇచ్చి పంపారు. కాకపోతే సాయంత్రం ఏడు గంటలలోగా ఇంటికి చేరుకోవాలని తెలిపారు. మీ  సహాయం లేకుంటే ఇబ్బంది పడేవారమని 30 మంది సభ్యులు డిప్యూటీ స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


logo