శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 02:42:58

వచ్చేవారం కాళేశ్వరం ఎత్తిపోతలు!

వచ్చేవారం కాళేశ్వరం ఎత్తిపోతలు!

  • లింక్‌-1, 2లలో మోటర్లను నడిపేందుకు ఏర్పాట్లు
  • కడెం వరదకనుగుణంగా  ఎల్లంపల్లిలో నీటినిల్వ 
  • ఎప్పటికప్పుడు ఎస్సారార్‌ మీదుగా జలాల తరలింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మోటర్లు నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్లంపల్లిలో పెద్దగా నీటినిల్వ లేకపోవడంతోపాటు ఎల్‌ఎండీ నుంచి కాకతీయకాలువకు నీటిని విడుదలచేస్తుండటంతో.. లక్ష్మీబరాజ్‌ నుంచి జలాల ఎత్తిపోయాలని యోచిస్తున్నారు. వచ్చేవారం నుంచి రోజుకు రెండు టీఎంసీలను తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒకవేళ ఎగువనుంచి వరదవచ్చినా ఆ మేరకు ఒడిసిపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గోదావరిలో వరద సరళికి అనుగుణంగా కాళేశ్వరం మోటర్లను నడిపే అవకాశం ఉన్నది. ఎస్సారెస్పీ ద్వా రా వరదవస్తే.. కాళేశ్వరం లింక్‌-1, 2 మోటర్లు నడిపే అవసరం ఉండదు. ఎల్లంపల్లికి  మాత్రమే వరద వస్తే లింక్‌-2 మోటర్లనే ఆన్‌చేస్తారు. మధ్యలో సరస్వతి బరాజ్‌కే ఎక్కువ వరదవస్తే ఆ మేరకు అక్కడి నుంచి పార్వతి బరాజ్‌ మీదుగా ఎల్లంపల్లికి తరలించవచ్చు. ఈ నేపథ్యంలో లక్ష్మీబరాజ్‌కు భారీఎత్తున వరద వస్తున్నప్పటికీ మోటర్లను నడపడంపై అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కడెంద్వా రా ఎల్లంపల్లికిగానీ, ఎగువన ఎస్సారెస్పీకిగానీ పెద్దగా వరద రావడం లేదు. మరోవైపు లోయర్‌మానేరు డ్యాంకు నీటిని విడుదల చేస్తుండటంతో ఎస్సారార్‌లోనూ నీటినిల్వలు తగ్గుతున్నాయి. దీంతో ఎల్లంపల్లికి, ఆపై అక్కడినుంచి ఎస్సారార్‌కు నీటిని తరలించాలని అధికారులు భావిస్తున్నారు.

ఎల్లంపల్లిలో ఆరు టీఎంసీలే

ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను 36.53 టీఎంసీల నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 6,654 క్యూసెక్కులు ఉంటే.. అవుట్‌ఫ్లో 7,654 క్యూసెక్కులుగా ఉన్నది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకు నీటివిడుదల కొనసాగుతున్నది. దిగువన కడెంకు 470 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండగా.. ప్రాజెక్టులో ఇంకా రెండు టీఎంసీల నిల్వకు అవకాశమున్నది. ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను 6.31 టీఎంసీలు మాత్రమే ఉన్నది. దిగువన ఎస్సారార్‌లో 25.87 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికిగాను 6.99 టీఎంసీల నిల్వ ఉన్నది. ఏడున్నర వేల క్యూసెక్కులను దిగువన ఎల్‌ఎండీకి వదులుతున్నారు. ఎల్‌ఎండీలో 24.07 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను 11.66 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎల్లంపల్లి, ఎస్సారార్‌, ఎల్‌ఎండీలలో 45 టీఎంసీల వరకు నీటినిల్వకు వీలుండగా.. అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లోనూ పుష్కలంగా అవకాశాలున్నాయి. 

ఐదారు టీఎంసీల కుషన్‌తో నిల్వ

ఎగువన వరద వచ్చేవారం వరకు ఇదేరీతిన ఉంటే లక్ష్మీబరాజ్‌ నుంచి అధికారులు జలాల ఎత్తిపోతను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం లక్ష్మీబరాజ్‌కు 80వేల క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా.. 12 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. సరస్వతి బరాజ్‌లో ఎనిమిది టీఎంసీలు, పార్వతి బరాజ్‌లో నాలుగున్నర టీఎంసీల నీటినిల్వ కొనసాగుతున్నది. ఈ క్రమంలో లక్ష్మీబరాజ్‌లో మోటర్లను ప్రారంభించగానే.. వరుసగా సరస్వతి, పార్వతి, అటునుంచి ఎల్లంపల్లి జలాలను నంది, గాయత్రీ మోటర్ల ద్వారా ఎస్సారార్‌కు నిరవధికంగా తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఎగువ నుంచి ఒక్కసారిగా వరదవస్తే అందుకనుగుణంగా మోటర్లను నిలిపివేస్తారు. ప్రతి జలాశయంలోనూ ఐదారు టీఎంసీల నిల్వకు అవకాశం ఉంచి.. జలాలను తరలించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. తర్వాత వరదవచ్చినా జలాలు వృథాకాకుండా ఉంటాయనేది ప్రణాళిక. logo