శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:22:54

జల సంబురం

జల సంబురం

  • రంగనాయకసాగర్‌ నీటితో చెరువులు, కుంటలకు జలకళ
  • రైతుల్లో హర్షాతిరేకాలు

చిన్నకోడూరు: కాళేశ్వరం నీటి రాకతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పండుగ జరుపుకొంటున్నారు. రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌తో కాల్వల ద్వారా గోదావరి జలాలు రావడంతో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకొంటున్నాయి. మండలంలోని 12 గ్రామాల్లో మొత్తం 28 చెరువులు, కుంటలు మొదటి విడుతలోనే నిండనున్నాయి. ఇప్పటికే రెండు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతుండటంతో రైతులు తమ పొలాలను దున్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. 

మాచాపూర్‌లోని చింతల చెరువు మత్తడి దుంకి అదే గ్రామంలోని తీగల కుంటలోకి అలుగు పారడంతో చిన్నకోడూరులోని అమ్మ చెరువులోకి గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. విఠలాపూర్‌లోని అంతమ్మ కుంట నిండి మత్తడి దుంకడంతో అదే గ్రామంలోని దొరవాని కుంటకు చేరుతున్నాయి. అంతమ్మకుంట నిండి ఇల్లెంతకుంట మండలంలోకి లెఫ్ట్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. గురువారం చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్‌లో చెరువులు, కుంటలు నిండటంతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్థులు గోదావరి జలాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు రైతులు జలకాలాటలతో మురిసిపోయారు. 


logo