బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 01:37:33

గజ్వేల్‌కు గంగమ్మ పరుగులు

గజ్వేల్‌కు గంగమ్మ పరుగులు

  • మల్లన్నసాగర్‌ నుంచి జలాల ఎత్తిపోత
  • ఒకటో మోటర్‌ ట్రయల్ రన్ ‌ సక్సెస్‌
  • కొండపోచమ్మకు అడుగుదూరంలో గోదావరి 

గజ్వేల్‌/ తొగుట: కాళేశ్వర గంగ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు పరుగులు పెట్టింది. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు అడుగు దూరంలోకి చేరుకున్నది. మంగళవారం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌ వద్ద గల మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌లో ఒకటో నంబర్‌ మోటర్ ‌ట్రయల్ రన్ ‌ విజయంతమైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌లో పూజలు నిర్వహించి.. మొదటి మోటర్‌ వ్యవస్థను 24 గంటలపాటు సింక్రనైజ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, మేఘా ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌రెడ్డి కంప్యూటర్‌ ద్వారా మోటర్‌ను ప్రారంభించారు. 

కొన్ని నిమిషాల్లోనే మల్లన్నసాగర్‌ డెలివరీ సిస్టర్న్‌ నుంచి జలాలు పొంగిపొర్లాయి. అక్కడి నుంచి కొండపోచమ్మ కాలువలో గోదారమ్మ గజ్వేల్‌ ప్రాంతానికి పరుగులు పెట్టింది. హరిరాం ఆధ్వర్యంలో అధికారులు డెలివరీ సిస్టర్న్‌ వద్ద పూలుచల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులు చేరుకొని సంబురాలు చేసుకున్నారు. మల్లన్నసాగర్‌ డెలవరీ సిస్టర్న్‌ నుంచి జలాలు దాదాపు 18 కిలోమీటర్లు ప్రవహించి అక్కారం చేరుకోనున్నాయి. అక్కడ సర్జ్‌పూల్‌ నిండిన తర్వాత మోటర్ల ట్రయల్ రన్ నిర్వహించి.. మర్కూక్‌ సర్జ్‌పూల్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక అక్కడి నుంచి అత్యంత ఎత్తయిన కొండపోచమ్మ జలాశయానికి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటాయి.

నేటినుంచి ఒక్కోపంపు వెట్ రన్ 

మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌లో మంగళవారం సాయం త్రం 7.45 నిమిషాలకు మొదటి మోటర్‌ వెట్ రన్ ‌ విజయవంతమైందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌లో 43 మెగావాట్లతో మొత్తం ఎనిమిది మోటర్లు ఉన్నాయని, ఇవి రోజుకు 0.8 టీఎంసీల జలాలను ఎత్తిపోస్తాయని చెప్పారు. బుధవారం నుంచి ఒక్కో మోటరు వెట్ రన్ ను  నిర్వహిస్తామని పేర్కొన్నారు.


logo