గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 18, 2021 , 01:19:36

కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి

కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి

  • యాసంగి సాగు కోసం ఎత్తిపోతలు ప్రారంభం
  • ఐదునెలల తర్వాత లింక్‌-1,2లో పంపింగ్‌ మొదలు
  • ఎల్‌ఎండీకి ఎనిమిది టీఎంసీల తరలింపు లక్ష్యం

పెద్దపల్లి, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం: ఐదు నెలల విరామం తర్వాత కాళేశ్వరంలో మళ్లీ జల సవ్వడులు మొదలయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్‌-1, 2లలో ఆదివారం ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది అగస్టులో భారీ వర్షాలు కురవడంతో ఎత్తిపోతల పథకం పరిధిలోని అన్ని మోటర్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు తిరిగి ఈ యాసంగిలో తొలిసారిగా నీటిని ఎత్తిపోస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం, అక్కడి నుంచి దిగువన ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా మోటర్లద్వారా ఎత్తిపోస్తున్నారు. రామగుండం ఈఎన్సీ ఎన్‌ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కాళేశ్వరం లింక్‌-1, 2 ఐబీ ఎస్‌ఈ, రామగుండం ఎస్‌ఈల ఆధ్వర్యంలో నీటిఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి.

ఆదివారం ఉదయం 8 గంటలకు లింక్‌-1 పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లిలోని లక్ష్మి, పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌస్‌లలో రెండు చొప్పున మోటర్లను ఆన్‌చేసి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. ఉదయం 11 గంటలకు లింక్‌-2లోని ధర్మారం మండలం నందిమేడారంలోని నంది, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్‌హౌస్‌లలో ఒక్కో మోటర్‌ చొప్పున ఆన్‌చేశారు. ఇక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీటిని తరలిస్తామని ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్సారార్‌ నుంచి ఎల్‌ఎండీలో ఖాళీగా ఉన్న 8 టీఎంసీలను నింపుతామని పేర్కొన్నారు. 


ఎల్‌ఎండీకి  మూడువేల క్యూసెక్కులు

లక్ష్మి పంప్‌హౌస్‌లో 16, 17 మోటర్ల ద్వారా 4,200 క్యూసెక్కులను సరస్వతి బరాజ్‌లోకి, సరస్వతి పంప్‌హౌస్‌లోని 9, 10 పంపుల ద్వారా 5,862 క్యూసెక్కులను పార్వతి బరాజ్‌లోకి, పార్వతి పంప్‌హౌస్‌లోని 11, 12 మోటర్లతో 2,610 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లికి తరలిస్తున్నారు. కాళేశ్వరం లింక్‌-2లోని నంది పంప్‌హౌస్‌లో ఒక మోటర్‌ను ఆన్‌చేసి 3,150 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్‌హౌస్‌కు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా అంతేమొత్తంలో జలాలు శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు చేరుకుంటున్నాయి. ఎస్సారార్‌ నుంచి రెండు తూముల ద్వారా 3,283 క్యూసెక్కులను ఎల్‌ఎండీకి విడుదల చేశారు. 

సందర్శకుల సందడి

సుమారు ఐదు నెలల తర్వాత కాళేశ్వరం నీటి విడుదలతో ఆయా పంప్‌ హౌస్‌ల్లోని డెలివరీ సిస్టర్న్‌ల వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది. ఉబికి వస్తున్న గోదావరి జలాలను చూసి ఉప్పొంగిపోయారు. ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడిపోయారు.  

VIDEOS

logo