గురువారం 09 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:33

తెలంగాణ జల తరంగిణి

తెలంగాణ జల తరంగిణి

  • జూన్‌ 21 స్పెషల్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై నేటికి ఏడాది
  • గతేడాది జూన్‌ 21న అట్టహాసంగా ప్రారంభం
  • మేడిగడ్డ నుంచి కొండపోచమ్మకు గోదారమ్మ
  • చెరువులకు జలకళ, ఉబికి వస్తున్న భూగర్భ జలం
  • తెలంగాణకు తీరిన తాగు, సాగునీటి గోస

అన్నదాతల అరిగోస తీరిపోయిన రోజు.. మొగులు కోసం బుగులుపడ్డ బతుకులకు భవిష్యత్తు పచ్చగా కనిపించిన రోజు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం జలధారలు ఉప్పొంగించిన రోజు. సరిగ్గా  ఏడాది క్రితం ఇదేరోజు కాళేశ్వరం పథకాన్ని సీఎం  కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

అప్పుడే ఏడాది గడిచిపోయింది. దేశంలోనే ఎవరూ ఊహించని ఆవిష్కారమిది. ఎగువ, దిగువ రాష్ర్టాల ముఖ్యమంత్రులు అత్యంత సామరస్యంతో, సౌహార్ద్రంతో కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమనేది దేశ చరిత్రలో బహుశా లేనేలేదేమో. ఎత్తిపోతల ప్రారంభమైనప్పటి నుంచి అడుగడుగునా గోదావరి జలతరంగిణి ధ్వనితరంగాలు యావత్‌ తెలంగాణను ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోనివ్వడంలేదు. ఎనిమిదిన్నర నెలలుగా వందల కిలోమీటర్లకొద్దీ కాల్వల్లో, చెరువుల్లో కాళేశ్వర జల ప్రవాహం నిరంతరంగా.. మండుటెండల్లోనూ పారడం చూస్తున్న కండ్లల్లోంచి కూడా నీరు ఉబికివస్తున్నది ఆనందబాష్పమై.

ములుగు, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కరువును పాలదోలాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలని, అన్నదాతలను అప్పుల ఊబిలోనుంచి గట్టెక్కించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి అమలుచేస్తున్నది. సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు గోదావరి జలాలను మళ్లించాలనే ఉద్దేశంతో 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి పునాదిరాయి పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు, ఇంజినీర్లు, కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తిచేసి రికార్డు సృష్టించారు.

180 టీఎంసీల నీరు ఎత్తిపోయడమే లక్ష్యం

గోదావరిపై లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్‌ నిర్మాణం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మం డలం కాళేశ్వరానికి దిగువన 20 కిలోమీటర్ల దూరంలో రూ.2,930 కోట్ల వ్యయంతో నిర్మాణంచేపట్టారు. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా లక్ష్మి బరాజ్‌ నిర్మించారు. ఈ బరాజ్‌లో అంతర్భాగంగా మహదేవ్‌పూర్‌ మండంలం కన్నెపల్లి వద్ద 290 ఎకరాల్లో రూ.4,600 కోట్లతో పంపుహౌజ్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 90 రోజులపాటు 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చటమే ధ్యేయంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. గోదావరి నదిపై వరుస సరస్వతి, పార్వతి బరాజ్‌లను నిర్మించారు.

ఏడాది పూర్తిచేసుకున్న అద్భుత ఘట్టం

కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016 మే 2న పునాదిరాయి పడగా, 2019 జూన్‌ 21న అత్యంత అట్టాహసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తోపాటు నాటి గవర్నర్లు నరసింహన్‌, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ముంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని హోమాలు నిర్వహించి, శిలా ఫలకాలను ఆవిస్కరించి, మోటార్లను ప్రారంభించారు. గత నెల 29న సిద్దిపేట జిల్లా మర్కూక్‌లోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరింది.


నిండుకుండల్లా చిన్ననీటి వనరులు

గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి గోస తీరినట్టయ్యింది. ఎత్తిపోసిన గోదావరి జలాలతో చెరువులు, కుంటలు మత్తల్లు దుంకుతూ నీటితో కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా నిండు వేసవిలోనూ చెరువులు నిండుకుండలుగా దర్శనమిచ్చాయి. ఎస్సారెస్పీ వరద కాలువ ప్రాజెక్టును తలపించింది. రైతులు యాసంగిలో వరి, మక్కజొన్న సాగుచేసి పుట్ల కొద్దీ ధాన్యం పండించారు. భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు కాలంతో పనిలేకుండా పోయింది. కార్తెలకు అనుగుణంగా పంటలు సాగుచేసుకునే పరిస్థితి ఏర్పడింది.

కాళేశ్వర గంగ ప్రయాణమిలా..

కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన 02-05-2016

ప్రాజెక్టు ప్రారంభోత్సవం 21-06-2019

సరస్వతి బరాజ్ 22-06-2019

పార్వతి బరాజ్ 21-07-2019

నంది రిజర్వాయర్‌ 05-08-2019

శ్రీరాజరాజేశ్వర జలాశయం 11-08-2019

అన్నపూర్ణ జలాశయం 11-03-2020

రంగనాయకసాగర్‌ 24-04-2020

తుక్కాపూర్‌ పంప్‌హౌజ్ 12-05-2020

అక్కారం పంప్‌హౌజ్‌ 19-05-2020

కొండపోచమ్మసాగర్‌ 29-05-2020


logo