శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 13:22:03

తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్‌ ఇంజిన్‌

తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్‌ ఇంజిన్‌

హైదరాబాద్‌ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ అభివృద్ధికి ఓ గ్రోత్‌ ఇంజిన్‌ అని ఆర్థిక మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 2019 జూన్‌లో సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇంత తక్కువ సమయంలోనే నిర్మించగలిగామంటే దానికి కారణం సీఎం కేసీఆర్‌ ఉక్కు సంకల్పమమే అని మంత్రి స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని, 618 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌ చేసి సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అద్భుతంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన వరుస బ్యారేజీలతో నేడు గోదావరి నది 150 కిలోమీటర్ల మేర జీవధారగా రూపుదాల్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు స్ఫూర్తితోనే పాలమూరు - రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగాం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతులకు అందిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌ మానేడు 24 టీఎంసీల నీటితో నిండు కుండలా కళకళలాడుతుందన్నారు. ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. కొద్ది కాలంలోనే రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు మంత్రి. 

కరువు పీడిత ప్రాంతమైన పాలమూరు, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల రూపు రేఖలను మార్చేందుకు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అభివృద్ధి నిరోధక శక్తులు ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం పట్టుదలతో పనులను జరిపిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వెయ్యికి పైగా చెరువులను నీటితో నింపామని తెలిపారు. వలసలు ఆగిపోయి వ్యవసాయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. మెదక్‌ జిల్లాలో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల రికార్డు సమయంలో, పాలమూరు జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల కాలంలో పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. సాగునీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 11,054 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.


logo