మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 01:45:52

చివరిచుక్కా ఎత్తిపోసుడే..

చివరిచుక్కా ఎత్తిపోసుడే..
  • మార్చిలోనూ లక్ష్మీ బరాజ్‌కు 2,100 క్యూసెక్కుల వరద
  • కాళేశ్వరం పంపులతో ఎల్‌ఎండీ వరకు ఎత్తిపోతలు
  • వానకాలం పంటకు నీటి నిల్వలు సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కాళేశ్వరం: వానకాలంలో నాలుగు నెలలు నీటిని నిల్వ చేసుకోవడం.. ఆపై ఎనిమిది నెలలు వాడుకోవడం.. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల తీరిది. కానీ, సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో వేసవి ఆరంభమైనా ఇంకా గోదావరి నుంచి ఎత్తిపోత కొనసాగుతున్నది. ఒక్క చుక్కనూ వదలకుండా వచ్చే సీజన్‌ కోసం నిల్వ చేసుకునేందుకు జలాశయాలకు తరలింపు జరుగుతున్నది. మార్చిలోనూ లక్ష్మీబరాజ్‌కు ఇన్‌ఫ్లోలు కొనసాగుతుండటం విశేషం. బుధవారం ఈ బరాజ్‌కు 2,100 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఎప్పటికప్పుడు ఆ నీటిని ఎగువకు తరలిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారం ఎల్‌ఎండీలో నీటిమట్టాన్ని పెంచుతున్నారు. గత నెల రెండో వారంలో పూర్తిస్థాయిలో 16.17 టీఎంసీల నిల్వతో ఉన్న లక్ష్మీ బరాజ్‌ నుంచి కొన్నిరోజులుగా జలాల్ని సరస్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. 


ఈ క్రమంలో బుధవారం బరాజ్‌లో నీటి నిల్వ 3.571 టీఎంసీలకు చేరుకున్నది. అయినప్పటికీ ఎగువ నుంచి వరద వస్తుండటంతో అధికారులు ఒక్క మోటరు ద్వారా 2,900 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా  ఎగువకు తరలిస్తున్నారు. సరస్వతి పంపుహౌజ్‌ నుంచి ఎగువన ఉన్న పార్వతి బరాజ్‌కు 2,900 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. పార్వతి పంపుహౌజ్‌ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలో ప్రస్తుతం 10.70 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఇన్‌ఫ్లో 5,500 క్యూసెక్కుల వరకు నమోదవుతున్నది. 


ఇక్కడి నుంచి ఏడువేల క్యూసెక్కులకు పైగా నీటిని నంది, గాయత్రి పంపుహౌజ్‌ల ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఇక్కడ 25 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చూస్తూ వరదను లోయర్‌మానేర్‌డ్యాం(ఎల్‌ఎండీ)కు తరలిస్తున్నా రు. ఎల్‌ఎండీలో 11.74 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో దిగువకు కాకతీయ కాల్వ ద్వారా 5,838 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కూడా కొనసాగుతుంది. కాకతీయ కాల్వ ద్వారా యాసంగికి సాగునీటిని అందించడం, చెరువులను నింపే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఇప్పటికిప్పుడు గోదావరిపై నిర్మించిన వరుస బ్యారేజీల్లో 14 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉండగా... ఎల్లంపల్లిలో 10.70 టీఎంసీలు ఉన్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 25 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 11.74 టీఎంసీలు 36 టీఎంసీల వరకు నీటి నిల్వలతో ప్రస్తుతం జలాశయాలు తొణికిసలాడుతున్నాయి. 


logo
>>>>>>