శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:22:07

గోదావరి పరుగులు

గోదావరి పరుగులు
  • కాళేశ్వరం లింక్‌-1, 2లో దిగ్విజయంగా ఎత్తిపోతలు

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: గోదారమ్మ మురిసిపోతున్నది. కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా దిశను మార్చుకొని ఎదురెక్కుతూ వందల కిలోమీటర్లమేర పాలకడలిలా విస్తరిస్తున్నది. ఇక్కడి లింక్‌ -1,2లో మోటర్లు దిగ్విజయంగా నడుస్తుండగా, గోదావరి అజేయంగా రైతన్న బీళ్లకు పరుగులు తీస్తున్నది. దిగువన భూపాలపల్లి జిల్లాలో లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు కొనసాగుతుండగా, ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనూ పంపులు నిర్విరామంగా నడుస్తున్నాయి. మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో  మంగళవారం 2వ మోటర్‌ ద్వారా ఎత్తిపోతల కొనసాగుతు న్నది.  2,900 క్యూసెక్కుల నీరు పార్వతి బ రాజ్‌లోకి చేరుతున్నది. 


పార్వతి పంప్‌హౌజ్‌ ద్వారా ఎగువన ఎల్లంపల్లి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ  3, 6వ మోటర్లను నడిపిస్తుండగా, ఒక్కో మోటర్‌ ద్వారా 2,610 క్యూసెక్కుల చొప్పున 5,220 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి బరాజ్‌లోకి చేరుతున్నది. ఇక లింక్‌-2లో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్‌హౌజ్‌లో 3, 4వ మోటర్ల ద్వారా మొత్తం 6,300 క్యూసెక్కులు నంది రిజర్వాయర్‌లోకి తరలుతున్నది. ఇక్కడి నుంచి  కరీంనగర్‌ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌజ్‌కు తరలుతున్నాయి. ఇక్కడ 2, 4వ పంపులతో మొత్తం 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 వరకు ఇక్కడ 13.525 టీఎంసీలు ఎత్తిపోసినట్టు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా రాంపూర్‌లో నిర్మించిన పంప్‌హౌజ్‌ నుంచి 4, 7వ యూనిట్ల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. 


ఎస్సారార్‌@ 25.873 టీఎంసీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి మంగళవారం 6,441 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 25.873 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.  ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి మంగళవారం 7,759 క్యూసెక్కులు వస్తుండగా, 5,838 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లింది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.574 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.


logo