బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 17, 2020 , 09:29:34

కేసీఆర్‌ సంకల్ప బలంతోనే కాళేశ్వరం జలధారలు

కేసీఆర్‌ సంకల్ప బలంతోనే కాళేశ్వరం జలధారలు

ప్రపంచంలో నిర్మాణమయిన అన్నిడ్యాంలు ఆయాదేశాల ఆర్థికప్రగతికి దోహదంచేశాయి. వాటిని నిర్మించడానికి పాలకులు అనేక అడ్డంకులు, విమర్శలను, పర్యావరణవేత్తల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థికసంస్థలు ఆ డ్యాంల నిర్మాణానికి ఆర్థికసహాయం అందించడానికి నిరాకరించాయి. అమెరికాలోహూవర్‌ డ్యాం, ఈజిప్ట్‌లో ఆస్వాన్‌హై డ్యాం, చైనాలోత్రీ గోర్జెస్‌డ్యాం నిర్మించే సమయంలో ఆయా దేశాలపాలకులు తీవ్రప్రతిఘటన ఎదుర్కొన్నారు. అయితే వారి సంకల్పబలం ముందు అవేవీ వారిని నిలువరించలేకపోయాయి. 


1930 దశకంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్ధికమాంద్యం ఆవరించి ఉన్న సమయంలో అధ్యక్షుడు హెర్బర్ట్‌ హూవర్‌ సంకల్పబలంతో అమెరికాలో కొలరాడో నదిపై హూవర్‌డ్యాం నిర్మాణం ప్రారంభమయింది. అనుకున్నదానికంటే రెండేండ్ల ముందే డ్యాం నిర్మాణం పూర్తిచేసుకోవడం విశేషం. హెర్బర్ట్‌ హూవర్‌ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్‌వెల్డ్‌కూడా రాజకీయాలకతీతంగా హూవర్‌ డ్యాం నిర్మాణానికి నిధులు సమకూర్చడం విశేషం. ఈ డ్యాం అమెరికాకు గ్రోత్‌ఇంజన్‌గా మారింది. 


ఇదే తరహాలో 1960 దశకంలో ఈజిప్టులో నైలునదిపై నిర్మించిన ఆస్వాన్‌ హైడ్యాం నిర్మాణానికి ఆనాటి ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ నాజర్‌ సంకల్పబలంతోనే పూర్తయింది. అమెరికా, యూరప్‌దేశాలు సహకరించకపోయినా సోవియట్‌ యూనియన్‌ అందించిన ఆర్థిక, సాంకేతిక సహకారంతో ఆస్వాన్‌ హైడ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయగలిగారు. ఆఫ్రికాఖండం అంతటా కరువు విలయతాండవం చేసినా ఆస్వాన్‌ డ్యాం కారణంగా ఈజిప్ట్‌ సుభిక్షంగా ఉండగలుగుతున్నది. నైలునది వరద భీభత్సాన్ని నివారించగలిగారు. చైనాలో యాంగ్షి నదిపై త్రీగోర్జెస్‌ డ్యాం నిర్మించాలన్నది చైనా విప్లవనాయకుడు మావో కల. 


ఆయన జీవితకాలంలో త్రీగోర్జెస్‌ డ్యాంని సాకారం చేసుకోలేకపోయాడు. చైనా కమ్యూనిస్టుపార్టీలో, చైనా పీపుల్స్‌ కాంగ్రెస్‌లో డ్యాంకు మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యాడు. డ్యాంనిర్మాణంపై చర్చ చైనాలో 40 ఏండ్లు కొనసాగింది. 1990వ దశకంలో జియాంగ్‌ జెమిన్‌ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో లీపెంగ్‌ చైనా ప్రధానమంత్రి పదవిలోకి వచ్చాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పార్టీలో, చైనాపీపుల్స్‌ కాంగ్రెస్‌లో డ్యాంకు మద్దతు కూడగట్టగలిగినాడు. ఆయన స్వయానా ఇంజినీర్‌ కావడం వలన ఈ పని సాధించగలిగినాడు. లీపెంగ్‌ సంకల్పబలంతోనే ఇవాళ త్రీగోర్జెస్‌ డ్యాం నిలబడగలిగింది. 


కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎన్నివిమర్శలు వచ్చినా, ఎన్నిఅడ్డంకులు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి, అనుమతులు సాధించి, నిత్యం ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి మూడేండ్ల అతి స్వల్పకాలంలోనే పూర్తిచేయించగలిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవ్వాళ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా మనముందు నిలబడి ఉన్నది. తెలంగాణలో 20 జిల్లాల్లో 45లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాదిగ్రామాలతోపాటు, హైదరాబాద్‌కు తాగునీరు, పరిశ్రమలకు నీరందించడానికి సిద్ధమయింది. ఈ ప్రాజెక్టు కేసీఆర్‌ సంకల్పబలంతోనే సాధ్యమయిందని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్‌ ఇంజిన్‌గా మారనున్నది.


ఇక కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి అన్నినిర్మాణ దశలను సీఎం కేసీఆర్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌ కోసం ఆయన జరిపిన మేథోమథనం దాదాపు ఆర్నెళ్ల పాటు సాగింది. ఇరిగేషన్‌ సమీక్ష అంటే ఉదయం 11 నుంచి రాత్రి 11గంటల వరకు సాగిన సందర్భాలు ఉన్నాయి. గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌వేర్‌, సర్వేఆఫ్‌ఇండియా మ్యాపులు, వాప్కోస్‌ వారి లిడార్‌ సర్వేనివేదికలు, రిటైర్డ్‌ ఇంజినీర్ల క్షేత్రస్థాయి పర్యటనలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత రూపంలో ప్రాణంపోసుకోవడానికి దోహదపడ్డాయి. అన్ని ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేశాక మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నదీమార్గాన్నే ముఖ్యమంత్రి ఎంపికచేశారు.


ఇందులో మూడు కొత్త బరాజ్‌లు, వాటికి అనుబంధంగా మూడు పంప్‌హౌజ్‌లు ప్రతిపాదించారు. మూడేండ్లలోనే వీటినిర్మాణం పూర్తయి 2019లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. రూపకల్పన సమయంలో ముఖ్యమంత్రి కన్నకలలు ఇవ్వాళ సాక్షాత్కారమయ్యాయి. 2019 జూన్‌, జూలైనెలల్లో, కరువు తాండవిస్తున్న సమయంలో గోదావరి నది 150 కి మీ పొడవున సజీవమఅయింది. గోదావరి నీరు మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు జలనీరాజనం పట్టారు. జలభోజనాలు, జలజాతరలు నిర్వహించుకున్నారు. కరువుకాలంలో గోదావరి ఇట్లా ఎదురెక్కి రావడం ఒక కొత్త అనుభవం. ప్రాజెక్టు విమర్శకులు గోదావరి ఇట్లా ఎదురెక్కివస్తున్న సందర్భాన్ని ఆస్వాదించలేక  కరంటుబిల్లులపై అజీర్తిని వాంతిచేయడం మొదలుపెట్టారు. వారికి సమాధానంగా లిఫ్ట్‌ సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ ఎన్‌ వెంకటేశ్వర్లు సహకారంతో వాస్తవికంగా కరంటు ఖర్చులు లెక్కలుగట్టి వెల్లడిచేసాం.


ఇక ప్రాజెక్టు రూపకల్పన ప్రక్రియ పూర్తయ్యాక పరిపాలనా అనుమతులు చకచకా వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016 మే 2న ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. తిరిగి ఆయనే 2019, జూన్‌ 21న ప్రాజెక్టును జాతికి అంకితంచేశారు. ప్రాజెక్టులకు శంకుస్థాపన ఒకరుచేస్తే ప్రారంభం మాత్రం మరొకరు చేయడం గతంలో చూశాం. దానిని బద్దలుకొట్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేసీఆరే జాతికిఅంకితం చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రాజెక్టు కట్టడం అంటే పదేండ్లు, ఇరవై ఏండ్లు అన్న భావన ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల మదిలోనుంచి తొలగించి, నిత్యం సీసీకెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చి, సమస్యలను పరిష్కరించి, సూచనలుచేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తిచేయించారు. అలాంటి శక్తియుక్తులు చైనీయులకేకాదు మనకూ ఉన్నాయని నిరూపించారు. తెలంగాణ సాధనఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించిన ఇంజినీర్లు కాళేశ్వరం నిర్మాణంలోనూ అదే స్పూర్తిని కొనసాగించారు. రాజకీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర అధికారులు, అనుమతుల కోసం కేంద్రప్రభుత్వ సంస్థలతో, కోర్టు కేసులను సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమై కాళేశ్వరం అనే ఆధునిక దేవాలయాన్ని నిర్మించడంలో సఫలమయ్యారు.


నిజానికి దేశ స్వా తంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ రాజ్యం ఒక సమగ్రమైన గోదావరివ్యాలీ అభివృద్ధి పథకాన్ని తయారుచేసింది. అమెరికాలోని టెన్నేసి వ్యాలీ అథారిటీ వారి అభివృద్ధి నమూనా ఈ అభివృద్ధి ప్లాన్‌కు స్ఫూర్తిగా నిలచింది. ఈ పథకంలో డ్యాంలు, జలాశయాలు, కాల్వలవ్యవస్థ, జలవిద్యుత్‌, థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మించాలని సంకల్పించారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, పరిశ్రమలస్థాపనకు నీరందించాలని భావించారు. 1951 లోహైదరాబాద్‌ రాష్ర్టప్రభుత్వం ప్రచురించిన“ Projects For Pro sperity : The Story of Hyderabad’s Bid For Self-sufficiency through Irrigation and Power Projects ” అన్న పుస్తకంలో గోదావరివ్యాలీ అభివృద్ధి ప్లాన్‌ ప్రతిపాదనలను సమగ్రంగా చర్చించారు. 


ఈ పుస్తక రచయిత శ్రీసాదత్‌ అలీఖాన్‌. ఈ ప్లాన్‌ రూపొందించడంలో ఆనాటి ప్రజాపనులశాఖ మంత్రి నవాబ్‌ జైన్‌ యార్‌ జంగ్‌ బహుదూర్‌, సెక్రటరీ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహుదూర్‌ కీలకపాత్ర పోషించారు. 1956లో తెలంగాణ, ఆంధ్రప్రాంతాల విలీనం తర్వాత తెలంగాణా సాగునీటిరంగం సంక్షోభంలోకి నెట్టబడింది. ప్రాధాన్యతలు మారిపోయాయి. ఆ క్రమంలో హైదరాబాద్‌ రాష్ర్టం రూపొందించిన గోదావరి వ్యాలీ అభివృద్ధి ప్లాన్‌ బుట్టదాఖలయింది. 70 ఏండ్ల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మరో రూపంలో ‘సమీకృత గోదావరి వ్యాలీ అభివృద్ధి పథకం’గా మన ముందుకువచ్చింది. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్యపరిశ్రమ, టూరిజం, పట్ణాణాభివృద్ధి, పర్యావరణం, దేశీయ జలరవాణా తదితర రంగాలను ప్రభావితంచేసి తెలంగాణ సమగ్రవికాసానికి దోహదంచేసే ఒక ప్రగతిరథంగా మారబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధమయింది. ఇదంతా తెలంగాణా  రాష్ర్టంగా ఏర్పడినందువల్లనే సాధ్యమయిందనేది నిర్వివాదం. అందుకు సీఎం కేసీఆర్‌ సంకల్పబలం తోడయింది.

- శ్రీధర్‌రావు దేశ్‌పాండే


కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడానికి అత్యంత కీలకమైనది మహారాష్ర్టతో కుదిరిన అంతర్రాష్ర్ట ఒప్పందం. ముఖ్యమంత్రి స్వయంగా రెండుసార్లు  ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్‌తో పరస్పర సహకారమే లక్ష్యంగా చర్చలు జరిపి ఒప్పందానికి అనుకూలంగా మార్చారు. ఇలాంటి ఒప్పందం ఉమ్మడిరాష్ర్టంలో సాధ్యంకాలేదు కాబట్టే తుమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ నిర్మాణం పదేండ్లు ముందుకుకదలలేదు. ఈ చారిత్రాత్మక ఒప్పందం కారణంగా పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై చనాకా కొరాట, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణానికి మార్గం సుగమమయింది. ఈ మూడింటిలో మేడిగడ్డ బరాజ్‌ పూర్తికాగా చనాకా కొరాట బరాజ్‌ నిర్మాణం చివరిదశలో ఉన్నది. మహారాష్ట్రతో ఈ అంతర్రాష్ర్ట ఒప్పందమే కేంద్రంనుంచి ప్రాజెక్టుకు అనుమతులు రాబట్టడానికి ప్రాతిపదిక అయింది. మహారాష్ట్రతో ఒప్పందం నదీజలాల వివాదాల పరిష్కారానికి దేశానికి ఒక మార్గనిర్దేశనం చేసింది. ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ప్రదర్శిస్తే దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కూడా పరిష్కారమవుతాయని ఈ ఒప్పందం నిరూపించింది.


పేదల ‘వెన్న’ంటే..

మనసున్న నేత, పేదలకు అండగా నిలిచే సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్‌ కొత్తపేట డివిజన్‌ ఆర్టీసీ కాలనీలోని ఎక్సెల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ నిర్వాహకులు దూగుంట్ల నరేశ్‌, ఎం నవకాంత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు కల్నరీ ఆర్ట్స్‌లో రూపొందించిన సీఎం కేసీఆర్‌ వెన్న శిల్పాన్ని ఆదివారం ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం కురుమ, బేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ తదితరులు పరిశీలించారు. 

- నమస్తే తెలంగాణ, ఎల్బీనగర్‌


66కిలోల బియ్యంతో..

66కిలోల బియ్యంతో సీఎం కేసీఆర్‌ ముఖచిత్రాన్ని తయారు చేశాడు రామరాజు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన రామరాజు రైతుబాంధవుడు కేసీఆర్‌కు 66వ జన్మదిన శుభాకాంక్షలంటూ కేసీఆర్‌ బొమ్మను చిత్రించి 66కిలోల బియ్యంతో బొమ్మను తీర్చిదిద్దాడు. గతంలో రామరాజు వడ్లతో సీఎం కేసీఆర్‌ చిత్రాన్ని తయారు చేశాడు. 

- గజ్వేల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ


చంద్రునికో నూలు పోగు!

ఈ మట్టికింత 

అస్తిత్వాన్ని అద్దినందుకు

అతనికెవ్వరూ నమస్కరించనక్కర్లేదు

నిండిన చెరువుకు పెట్టినా

పచ్చని చెట్టుకు మొక్కినా

అది అతనికే చెందుతుంది!


పుట్టినరోజని

అభినందించడానికి ప్రగతి భవన్కే పోనక్కరలేదు

రైతు బంధు కళ్ళల్లో మెరుపు చూసినా

వయోవృద్ధుల ధైర్యాన్ని దర్శించినా

అతనికి శుభాకాంక్షలు చెప్పినట్లే!


అతన్ని ఆశీర్వదించడానికి

ఎవరూ శ్రమించక్కర లేదు

ఒక కాళేశ్వరము

ఒక యాదాద్రి 

కాల గమనంలో అతని ఉనికిని

చిరస్థాయిగా ఎలుగెత్తి చాటుతూనే ఉంటాయి!


కొండమీద నిలబడి నేనందరిలా

చంద్రునిలో మచ్చలు వెతకలేను

నేను కవిని కదా

వెన్నెలను ఆస్వాదించడం నా సహజాతం!!         


logo