బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:32

కాకతీయకాలువ విస్తరణే మేలు

కాకతీయకాలువ విస్తరణే మేలు

  • రూ.750 కోట్ల ప్రతిపాదనకే కమిటీ ప్రాధాన్యం
  • హన్మకొండ వద్ద యథావిధిగానే కాలువ సామర్థ్యం
  • ఇబ్బంది రాకుండా గోడల నిర్మాణం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించిన ఇంజినీర్ల కమిటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాకతీయ కాలువ విస్తరణపై క్రమంగా స్పష్టత వస్తున్నది. కాలువలో ప్రవాహ సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచేందుకు నాలుగు ప్రతిపాదనలను రూపొందించిన కమిటీ.. అందులో కాలువ విస్తరణ ప్రతిపాదనకే ప్రాధాన్యమిస్తున్నది. సాంకేతికంగా.. అంచనాపరంగా ఈ ప్రతిపాదన మేలనే నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లింది. 8,500 క్యూసెక్కులు పారాల్సిన కాకతీయకాలువలో డిజైన్‌లో లోపం, నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడంతో గరిష్ఠంగా 2-3వేల క్యూసెక్కులు మాత్రమే పారాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సక్రమ నిర్వహణతో గరిష్ఠంగా ఆరువేల క్యూసెక్కుల జలాలు ప్రవహించాయి. 

గత యాసంగిలో ఆర్నెళ్లపాటు ఏకధాటిగా కాకతీయకాలువలో నీటి ప్రవాహం కొనసాగింది. ఎల్‌ఎండీ దిగువన ఐదున్నర లక్షల ఎకరాల వరకు ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉన్నందున.. కాకతీయ కాలువ సామర్థ్యాన్ని తొమ్మిది వేల క్యూసెక్కులకు పెంచేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం ఏర్పాటైన ఇంజినీర్ల కమిటీ నాలుగు ప్రతిపాదనలను సిద్ధంచేసిన విషయం తెలిసిందే. సమాంతర కాలువ, కొత్త అలైన్‌మెంట్‌తో నూతన కాలువ నిర్మాణం, కాలువ లోతును ఐదునుంచి 5.6 మీటర్లకు పెంచడంతోపాటు, కాకతీయ కాలువను విస్తరించడం ద్వారా తొమ్మిదివేల క్యూసెక్కుల నీటిని తరలించవచ్చని కమిటీ నివేదిక రూపొందించింది. ఇదే విషయాన్ని రెండురోజుల క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించినట్టు తెలిసింది. ముఖ్యంగా వీటిల్లో కాకతీయ కాలువను విస్తరించాలనే ప్రతిపాదన బాగున్నదని పేర్కొంటూ.. కమిటీ దీనికి మొదటి ప్రాధాన్యమిస్తున్నదనే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. 

హన్మకొండ దగ్గర యథావిధిగా

  • ఎల్‌ఎండీ (146 కిలోమీటర్‌)నుంచి 230 కిలోమీటర్‌ వరకు అంటే 84 కిలోమీటర్లు కాలువను విస్తరించాలని కమిటీ ప్రతిపాదించింది. 
  • ప్రస్తుతం కాకతీయ కాలువ వెడల్పు 27 మీటర్లు. ఇందుకు అదనంగా ఐదుమీటర్లు విస్తరిస్తే 32 మీటర్లకు పెరుగుతుంది. తద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల ప్రవాహం సాధ్యమవుతుందని కమిటీ నివేదికలో స్పష్టంచేసింది. 
  • కాకతీయ కాల్వ హన్మకొండ పట్టణం (228 కిలోమీటరు) మీదుగానే వెళ్తుంది. ముఖ్యంగా అక్కడ రహదారికి ఎగువన ఆరుమీటర్ల ఎత్తులో కాలువ నిర్మాణం ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడ కాలువను విస్తరించడం సాధ్యంకాదని ఇంజినీర్ల కమిటీ తేల్చింది. 
  • వాస్తవంగా ఇక్కడ 7,400 క్యూసెక్కుల ప్రవాహానికి కాలువ సరిపోయినా పూర్తిస్థాయి ప్రవాహాన్ని కొనసాగించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో గత యాసంగిలోనూ 4వేల నుంచి 5వేల క్యూసెక్కులకే పరిమితం చేశారు. 
  • ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువలోకి వదిలిన నీరు ఎగువన డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆయకట్టుకు వెళ్లగా.. హన్మకొండకు వచ్చేసరికి ఏడువేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే సరిపోతుందని పరిశీలనలో తేలింది. 
  • హన్మకొండ వద్ద పూర్తిస్థాయిలో కాలువను పారించి.. ఇబ్బందులు రాకుండా రెండువైపులా రక్షణ గోడలు నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. తద్వారా 228 కిలోమీటర్‌ నుంచి దిగువకు 7,400 క్యూసెక్కుల ప్రవాహంతో దిగువన ఉన్న ఆరునుంచి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని తేల్చింది. కాలువ విస్తరణ, రక్షణ గోడల నిర్మాణంవంటి వాటికి రూ.750 కోట్లు అంచనా వ్యయం అవుతుందని కమిటీ నివేదికలో పొందుపరిచింది.


logo