శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 01:35:50

బీజేపీ నాయకులు దద్దమ్మలు

బీజేపీ నాయకులు దద్దమ్మలు

  • మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

హన్మకొండ, జనవరి 11: బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. సోమవారం హన్మకొండలోని మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ నివాసంలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి కడియం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో వరంగల్‌ బాటపట్టిన బీజేపీ నాయకులు.. గుళ్లు, చర్చీలు, బైబిల్‌ అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతు న్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలే చెప్పి, ఇప్పుడు విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైన ఈ ఆరున్నరేళ్లలో కనీసం ఒక్క పెద్ద ప్రాజెక్టు గానీ, విద్యాసంస్థలు గానీ తీసుకొచ్చారా అని నిలదీశారు. తెలంగాణ విభజన అంశాలు పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో విద్యాసంస్థలతోపాటు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిందని, మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అభివృద్ధి కోరుకునే వారైతే ఇప్పటికైనా రాష్ర్టానికి ట్రైబల్‌ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ, కాళేశ్వరానికి జాతీయహోదా, మిషన్‌ భగీరథకు నిధులు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీలు తేవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూపాయి కూడా పక్కదారి పట్టలేదని, కేంద్ర నిధులపై చర్చ కోసం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌కు రావాలంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణ రాష్ట్రం వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి కట్టిన వాటిలో సగం కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదన్నారు. ఒక బాధ్యతగల సీఎంపై బీజేపీ నాయకులు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని, కానీ తాము విజ్ఞత, విధేయత, భాష సరళి తెలిసిన నాయకులమని చెప్పారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.