శనివారం 30 మే 2020
Telangana - May 03, 2020 , 01:21:12

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి శనివారం ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఏప్రిల్‌ 20న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు విజయ్‌సేన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. శనివారం ఉదయం కోర్టు హాల్‌నంబర్‌ ఒకటిలో జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి కుటుంబసభ్యులు, కొందరు ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖులందరూ కోర్టుహాల్‌లోకి ప్రవేశించే ముందు శానిటైజర్లతో చేతులు శుభ్రంచేసుకోవడంతోపాటు మాస్కులు ధరించారు. ప్రమాణస్వీకారాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి, పీపీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి సంఘం అభినందనలు

బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డికి రెడ్డి జనసంఘం నాయకులు అభినందనలు తెలిపారు. సంఘం సలహాదారు ప్రొఫెసర్‌ కంచర్ల దశరథరెడ్డి, అధ్యక్షుడు వేమిరెడ్డి నర్సింహారెడ్డి.. జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిని సన్మానించారు.

ఏపీలో నూతన న్యాయమూర్తుల ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్‌, కే సురేశ్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి శనివారం ప్రమాణం స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణం చేయించగా, వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది.


logo