ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 01:23:06

ఎట్టకేలకు పట్టా

ఎట్టకేలకు పట్టా

  • ‘నమస్తే’ కథనంతో రైతుకు న్యాయం
  • ఖాతాలో రైతుబంధు సొమ్ము
  • ఆనందంలో ములుగు అన్నదాత

ములుగు: తరాలుమారినా రైతులకు భూమి సమస్యలు అపరిష్కృతంగానే ఉండేవి. వాటిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నమస్తే తెలంగాణ తనవంతు సాయం చేసింది. ఏండ్లుగా తీరని భూ సమస్యలకు పరిష్కారం చూపింది. అన్నదాతలకు న్యాయం చేసింది. అందులో ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన తాడిచెర్ల సంతోష్‌ అనే రైతు ఒకరు. తన తండ్రి తాడిచెర్ల సారయ్య ఇతరుల వద్ద కొనుగోలు చేసిన సర్వేనంబర్‌ 289/అ/1లోని మూడెకరాల భూమిని తన పేరు మీద సాదాబైనామా కింద పట్టా చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు 21 గుంటల భూమికే పట్టా ఇచ్చారు. మిగిలిన 2.19 ఎకరాల భూమిని పట్టా కోసం తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాలేదు. ఆ సమయంలో ‘నమస్తే తెలంగాణ’కు సంతోష్‌ తన సమస్యను చెప్పగా.. గతేడాది ఏప్రిల్‌ ‘పట్టాగోడు పట్టదా..? అనే శీర్షీకతో కథనం ప్రచురించింది. స్పందించిన అప్పటి తాసిల్దార్‌ దేవాసింగ్‌ విచారణచేసి రైతుకు న్యాయం చేశారు. సంతోష్‌ పేరుపై మిగతా భూమిని ఎక్కించి పట్టాదార్‌పాస్‌ పుస్తకం అందించారు. రైతుబంధు డబ్బులు ఈ నెల రెండున సంతోష్‌ ఖాతాలో జమఅయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ తనకు పెద్దదిక్కుగా నిలిచిందని సంతోష్‌ ఆనందం వ్యక్తంచేశారు. నా జీవితాంతం ఈ సాయాన్ని మరువలేను అనిచెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాను పొరుగున ఉన్న బడారైతు రద్దు చేయాలని కుట్ర చేసిండు. ప్రభుత్వం, అధికారులు న్యాయం వైపు నిలిచి నాకు సహాయం అందించడం మర్చిపోలేను. సీఎం కేసీఆర్‌ ఉన్నంతకాలం రైతుకు ఏ విషయంలోనూ భయం లేదు. ఆయనకు రైతులందరూ రుణపడి ఉంటారు’అని సంతోష్‌ పేర్కొన్నారు.logo