బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 19:15:46

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం చేయాలి: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం చేయాలి: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌: జిల్లాలో  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  సంబంధిత అధికారులకు ఆదేశించారు. నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

జిల్లాలో 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నమోదైన అట్రాసిటీ కేసులను సమీక్షించారు. అట్రాసిటీ బాధితులకు రిలీఫ్‌ ఫండ్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌరహక్కుల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి పంచాయతీ దగ్గర లేదా రచ్చబండ దగ్గర పౌరహక్కుల చట్టంపై గ్రామ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బోగస్‌ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. 

ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌, జిల్లా కలెక్టర్‌ ముషార్రఫ్‌ ఫారూఖీ అలీ, పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మారక ద్రవ్యాల నిషేదిత చట్టం దర్యాప్తులో మెళుకువలకు సంబంధించిన బుక్‌లెట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆవిష్కరించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo