శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:20:52

జూరాల, భీమా చివరి ఆయకట్టుకు కల్వకుర్తితో జీవం

జూరాల, భీమా చివరి ఆయకట్టుకు కల్వకుర్తితో జీవం

  • సింగోటం ద్వారా జలాల తరలింపు
  • రూ.147 కోట్లతో 30-35 వేల ఎకరాలకు సాగునీరు
  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నీటిపారుదలశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జూరాల ఎడమకాల్వ, భీమా ప్రాజెక్టు చివరి ఆయకట్టులోని 35 వేల ఎకరాల దుస్థితి త్వరలో మారనున్నది. ఆ భూములకు కల్వకుర్తితో జీవం పోసేందుకు నీటిపారుదలశాఖ సింగోటం-గోపాల్‌దిన్నె ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. జూరాల ఎడమ ప్రధానకాల్వ కింద పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆత్మకూర్‌, కొత్తకోట, పెబ్బేరు, వీపనగండ్ల, కొల్లాపూర్‌ మండలాల పరిధిలోని 1,04,741 ఎకరాలను ఆయకట్టుగా నిర్దారించారు. కానీ, కాల్వ చివరన ఉన్న కొల్లాపూర్‌, వీపనగండ్ల మండలాల పరిధిలోని 26వేల ఎకరాలకు ఏనాడూ నీరుపారలేదు. అదేవిధంగా రాజీవ్‌భీమా ప్రాజెక్టు ఆయకట్టులో నూ చివరి భూములైన ఇదే మండలాల్లోని 9వేల ఎకరాలదీ అదే పరిస్థితి. ఇలా రెండు ప్రాజెక్టుల కిందఉన్న 35 వేల ఎకరాలకు మెట్టపంటలే దిక్కయని పరిస్థితిన ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్కార్‌ సాంకేతిక సాధ్యాసాధ్యాలు పరిశీలించి.. ప్రతిపాదనలు రూ పొందించాలని ఆదేశించింది.

కల్వకుర్తి ప్రాజెక్టుతో జలకళ

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ 35వేల  ఎకరాలకు నీరందించేలా అధికారులు ప్రతిపాదన లు రూపొందించారు. కల్వకుర్తి ప్రాజెక్టులో శ్రీశైలం జలాశయం నుంచి లిప్టుచేసిన కృష్ణాజలాలు తొలుత ఎల్లూరు రిజర్వాయర్‌కు తరలుతాయి. అక్కడి నుంచి సింగోటం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ తద్వారా రెండోదశ లిఫ్టు ఉన్న జొన్నలబొగుడకు పంపిస్తారు. అదేసమయంలో సింగోటం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి దాదాపు 250-280 ఎఫ్‌ఆర్‌ఎల్‌లోఉన్న గోపాల్‌దిన్నె రిజర్వాయర్‌కు కేవలం గ్రావిటీపైనే నీరందించేందుకు అవకాశం ఉన్నది. గోపాల్‌దిన్నె నుంచి లింక్‌ కెనాల్‌తో జూరా ల, భీమా పరిధుల్లోని 35 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరందించవచ్చు. జూరాల ఎడమకా ల్వ, భీమా ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపుల్ని 3.5 టీఎంసీల మేర తగ్గిస్తూ గత ఫిబ్రరిలోనే రాష్ట్రస్థాయి సాంకేతిక సలహా కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసి.. తాజాగా రూ.147కోట్ల అంచనాతో సింగోటం-గోపాల్‌దిన్నె లింక్‌కెనాల్‌ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపా రు.  చివరిఆయకట్టు భూములకు జీవంపోసేందుకు సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారని ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.


logo