మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 12:26:12

నిండిన జూరాల.. శ్రీశైలానికి వరద ప్రవాహం

నిండిన జూరాల.. శ్రీశైలానికి వరద ప్రవాహం

గద్వాల: జోగులాంబ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి 83,779 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా, ప్రస్తుతం 318.100 మీటర్ల వరకు నీరు ఉన్నది. దీంతో డ్యాంలో ప్రస్తుతం 8.810 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయం పూర్తిగా నిండితే 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అయితే ఎగువనుంచి 75 వేల క్యూసెక్యుల నీరు డ్యామ్‌లోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తివేశారు.   

శ్రీశైలం వైపు కదులుతున్న కృష్ణమ్మ  

జూరాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల నుంచి మొత్తం 87,317 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం బరాజ్‌లోకి 86,203 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 831.40 అడుగుల నీరు ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు. అయితే ఇప్పుడు డ్యాంలో 55.87 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.


logo