శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:23:31

జంగల్‌ బచావో.. జంగల్‌ బఢావో

జంగల్‌ బచావో.. జంగల్‌ బఢావో

 • ఆరో విడుత హరితహారానికి సర్వం సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ‘జంగల్‌ బచావో.. జంగల్‌ బఢావో’ నినాదంతో చేపట్టనున్నది. రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యంలో 34 ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యమవుతున్నాయి. ఈ నెల 20నుంచి 20 కోట్ల మొక్కలను ఊరూవాడల్లో  నాటేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అటవీశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గత ఐదు విడుతల్లో విజయవంతంగా మొక్కలు నాటిన ప్రభుత్వం ఆరో విడుతలో పట్టణ ప్రాంతాల సమీపంలో అర్బన్‌ ఫారెస్ట్‌కు, కొత్త అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. రైతులకు అదనపు ఆదాయం, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంపొందించేందుకు ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రాధా న్యం కల్పిస్తున్నది. ఈ విడుతలో టేకు, సరుగుడు, చింత, రావి, వేప చెట్లను, పండ్ల మొక్కలను నాటనున్నారు. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ, క్షేత్ర స్థాయి నివేదికలు, సిబ్బంది ద్వారా మంచి చెడులు తెలుసుకున్న ప్రభుత్వం అంచనాలు సవరించింది. 

24.74 కోట్ల మొక్కలు సిద్ధం

అటవీ అధికారులతో సన్నాహకాలపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. మరోవైపు అధికార యంత్రాంగాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమాయత్తం చేస్తున్నారు. అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ శోభ అన్ని జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆరో విడుతహరితహారంలో అటవీశాఖ అధ్వర్యంలో 3.59కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని నర్సరీల్లో పెంచిన 21.16 కోట్లు కలిపి మొత్తం 24.74 కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈసారి హరితహారంలో పెద్దఎత్తున చింత మొక్కలను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అటవీశాఖ ఆధ్వర్యంలో 24.50 లక్షలు, గ్రామాల్లోని నర్సరీల్లో 81.69 లక్షల చింత మొక్కలను సిద్ధం చేశారు. ప్రతిశాఖ నుంచి తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని, అటవీ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని సూచించారు. అందరూ భాగస్వాములై ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. సింగరేణి ఆరోవిడుత లక్ష్యం 35.49 లక్షలు సింగరేణి సంస్థ ఆరో విడుత హరితహారంలో 35.49 లక్షల మొక్కలు నాటా లని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఆ మేరకు సంస్థ వ్యాప్తంగా ఉన్న 12 నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచింది.

ఆరో విడుత హరితహారం ప్రత్యేకతలు..

 • జంగల్‌ బచావో - జంగల్‌ బఢావో (అడవిని కాపాడుదాం - అడవిని విస్తరిద్దాం) నినాదం.
 • ఆగ్రోఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యం. రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయవనరుల పెంపు.
 • ఈ విడుతలో టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం.
 • పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచటం.
 • హరితహారంలో భాగంగా అన్ని పట్టణాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల ఏర్పాటు.
 • స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో హరితహారం.
 • సామాజిక ప్రాంతాలు, శ్మశానాలు, చెరువు లు, కాలువలు, ప్రాజెక్టుల వద్ద మొక్కలు నాటుట.
 • ప్రతీ ఊరిలో ఒక చిన్న పార్కు, కనీస వసతులతో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు.
 • ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వటం, బాధ్యతగా పెంచేలా పంచాయతీల పర్యవేక్షణ.
 • కోతుల బెడద నివారణకు ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్క జాతులను అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళికలు.
 • గత ఐదు విడుతల్లో నాటిన మొక్కల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి మార్పుచేయటం.
 • కేంద్ర ప్రభుత్వ బ్యాంబూ మిషన్‌ (వెదురు ప్రోత్సాహక సంస్థ) సహకారంతో చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంపకానికి ప్రోత్సాహం.logo