మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 01:33:41

సచివాలయంపై తీర్పు రిజర్వు

సచివాలయంపై తీర్పు రిజర్వు
  • జీ బ్లాక్‌ హెరిటేజ్‌ భవనం కాదు: హైకోర్టు
  • ఆధారంలేని పిటిషనర్ల వాదన నిలువదు
  • అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన సచివాలయ భవననిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లలో ఎటువంటి మెరిట్‌లేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ప్రసాద్‌ స్పష్టంచేశారు. ఐకానిక్‌ సెక్రటేరియట్‌ బిల్డింగ్‌తో రాష్ట్రానికి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. సమీకృత సచివాలయం  నిర్మించాలన్న క్యాబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగియడంతో చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వుచేస్తున్నట్టు ప్రకటించింది. 


అంతకుముందు ఏజీ వాదనలు వినిపిస్తూ కాళ్లు లేకుండా మనిషి నిలబడటం ఎలా అసాధ్యమో.. క్యాబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేయడానికి ఆధారంలేని పిటిషనర్ల వాదన నిలువదని పేర్కొన్నారు. బకింగ్‌హం ప్యాలెస్‌ 400 ఏండ్లుగా నిలిచి ఉన్నదని, అలాంటి ఐకానిక్‌ భవనం కట్టగలిగినప్పుడే అందరూ గుర్తిస్తారని పేర్కొన్నారు. పిటిషనర్లు ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పుల్లోని అంశాలకు ప్రస్తుత అంశానికి సంబంధం లేదని చెప్పారు. క్యాబినెట్‌ సబ్‌కమిటీ, ఈఎన్సీల కమిటీలు నూతన భవన నిర్మాణానికే మొగ్గుచూపాయని పేర్కొన్నారు. ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత భవనాలను కూలగొట్టాలనే నిర్ణయానికి ముందు క్యాబినెట్‌ ఎటువంటి మెటీరియల్‌ను పరిశీలించలేదని, తర్వాత టెక్నికల్‌ కమిటీని నియమించారని పేర్కొన్నారు. 


భవనాల పటిష్టతను మూడోపార్టీతో పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎర్రమంజిల్‌ భవనం తరహాలోనే సచివాలయం ప్రాంగణంలో కూడా 1887లో నిజాంకాలంలో నిర్మించిన సర్వహిత (జీ బ్లాక్‌) భవనం కూడా హెరిటేజ్‌ భవనమని చెప్పేందుకు ఆమె ప్రయత్నం చేశారు. ఈ వాదనను ధర్మాసనం తిప్పికొట్టింది. సచివాలయం అంశానికి ఎర్రమంజిల్‌ అంశానికి ఎటువంటి సంబంధం లేని అంశాలను కలగలిపి అయోమయానికి గురిచేయవద్దని చురకలంటించింది. ఎర్రమంజిల్‌ భవనాన్ని హెరిటేజ్‌ భవనంగా గుర్తించారని, ఆ ప్రాంతం హెరిటేజ్‌ సైట్‌గా కొనసాగుతున్నదని తెలిపింది. సచివాలయం ప్రాంతాన్ని హెరిటేజ్‌ సైట్‌ అనిగానీ, జీ బ్లాక్‌ భవనాన్ని హెరిటేజ్‌ భవనంగా ఎప్పుడూ గుర్తించలేదని, ఏ జాబితాలోనూ లేదని స్పష్టంచేసింది. జీ బ్లాక్‌ హెరిటేజ్‌ భవనమని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదని ధర్మాసనం చెప్పడంతో, న్యాయవాది రచనారెడ్డి తన వాదను వెనుకకు తీసుకున్నారు. 


logo
>>>>>>