ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:57

పల్లెకు జేపీఎస్‌ల వెలుగులు

పల్లెకు జేపీఎస్‌ల వెలుగులు

  • ఏడాది పూర్తి చేసుకున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు
  • గ్రామాల సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో అవిరళ కృషి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పల్లెను ప్రగతిబాట పట్టించాలంటే అక్కడి పాలన పటిష్టంగా ఉండాలి. గ్రామంలో ఏ పనిచేసినా ప్రజలంతా తమ ఇంట్లోపనే అనుకొని అందులో మమేకం కావాలి. అది సాధ్యం కావాలంటే ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపించి ప్రతి పనిలో భాగస్వాములను చేయగల అధికారి కావాలి. రాష్ట్రంలో ఆ పనిని అంతఃకరణ శుద్ధితో చేస్తున్నారు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు. 

పల్లెకు పచ్చదనాన్ని ఇస్తున్న జేపీఎస్‌లు

‘గ్రామాల రూపురేఖలు మారాలే.. మన పల్లెలను దేశానికే ఆదర్శంగా నిలుపాలే’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలు సాధించే బృహత్‌ కార్యంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) సారథులై ముందుకు సాగుతున్నారు.  కార్యదర్శి లేని గ్రామమే ఉండకూడదని ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో 9,355 మంది జేపీఎస్‌లను నియమించింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలోనూ జేపీఎస్‌లు కీలకపాత్ర పోషించారు. కరోనా కష్టకాలంలోనూ మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారు. జేపీఎస్‌లు విధుల్లో చేరగానే ఎంపీటీసీ ఎన్నికలొచ్చాయి. దీంతో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే పనిచేయాల్సి వచ్చింది. ఆ వెంటనే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ 30 రోజులు గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దటంలో జేపీఎస్‌లు కీలకంగా వ్యవహరించారు. మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేయించడం, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రిండం, పాడు బడిన బోరుబావులను మూసేయడం వంటి పనులు వారి భాగస్వామ్యంతోనే సాగాయి.  పల్లెప్రగతి రెండో విడతలోనూ అదే స్ఫూర్తితో గ్రామాలను మెరిపించారు. ఏడాది పనితీరు వినూత్న అనుభవాన్ని ఇచ్చిందంటున్న జేపీఎస్‌లు, మరింత కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. 

అన్ని శాఖలతో పనిచేసే అవకాశం

అన్ని శాఖలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కరోనా కట్టడిలో పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖలతో మేమూ భాగస్వాములు కావటం గర్వంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా మమల్ని పర్మినెంట్‌ చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని నా విజ్ఞప్తి.

- యూసుఫ్‌, వేమనపల్లి జేపీఎస్‌, మంచిర్యాల జిల్లా

కలిసికట్టుగా రోడ్లు బాగుచేశాం 

నేను వెళ్లాక గ్రామంలో సిబ్బంది సహకారంతో రోడ్లన్నీ బాగుచేయించాం. పల్లెప్రగతి 30 రోజుల కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బాగా పనిచేశారంటూ గ్రామస్థులు అంటుంటే నాకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.   

- అజయ్‌, జగన్నాథపురం జేపీఎస్‌, సూర్యాపేట జిల్లా  

మొక్కలు బతికేలా నిరంతర పర్యవేక్షణ

హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు 85శాతం మొక్కలు బతికేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నా. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి.  

- సందీప్‌, అంకంపల్లి జేపీఎస్‌, పెద్దపల్లి జిల్లా

200 మందికి ఉపాధి చూపుతున్నాం

జేపీఎస్‌గా అవకాశం రావడంతో ఉపాధిహామీ పథకం కింద రోజూ 200 మందికి ఉపాధి చూపించగలుగుతున్నా. ఎలా పనిచేస్తే ఎక్కువ కూలి వస్తోందో కూలీలలో చైతన్యం తీసుకువస్తున్నా. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పాల్గొనడం గొప్పగా అనిపిస్తోంది.

- నరేశ్‌ కుమార్‌, గుల్లకోట జేపీఎస్‌, జగిత్యాల జిల్లా


logo