మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 27, 2020 , 16:59:21

జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి శీనివాస్ గౌడ్

జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి శీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: జర్నలిస్టులకు జనబాహుళ్యంలో తిరిగే అనివార్యత ఉంటుంది.  కరోణ కరాళ నృత్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.   మహబూబ్ నగర్ కలెక్టరేట్ రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జర్నలిస్టులకు శానిటరీ కిట్ తో కూడిన బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రజానీకంలో అవగాహన తీసుకు రావడంలో తమతో పాటు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జర్నలిస్టుల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వారికి వెంటనే కావలసిన శానిటరీ కిట్లను పంపిణీ చేయాలని తమకు సూచించిన నేపథ్యంలో జర్నలిస్టు సోదరులకు సానిటరీ కిట్లతో కూడిన బ్యాగులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

విధి నిర్వహణలో పడి జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను అశ్రద్ధ చేయవద్దు అని దీని పర్యవసానం కుటుంబం మొత్తం పై ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. వార్తల కవరేజ్ కి వచ్చినప్పుడు కచ్చితంగా ఫీల్డ్ కు సానిటరీ కిట్లు వెంట తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. అగ్రరాజ్యమైన అమెరికా ని వణికిస్తున్న ఈ మహమ్మారి నీ ప్రారదొలాలంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ ను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నిర్భంధం విధించుకునేలా జర్నలిస్టులు అవగాహన కల్పించాలన్నారు. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పౌరసమాజం కరోణ మహమ్మారిపై రాజీలేని యుద్ధం చేస్తుంటే కొంతమంది కరోణ వైరస్ ను హాస్యాస్పదంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారని అలాంటి వారిపై నాన్ బెయి లబుల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పోలీసు శాఖను ఆదేశించారు.

ఎంతోమంది ఉదారవాదులు ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు తమ వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి  ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారని జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు రమేష్ సరోదే 50 వేల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసినట్లు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ రామ్ మోహన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ విజయ్ కాంత్ తదితరులు మంత్రిని కలిసి వైద్యుల తరఫున ఎలాంటి సహాయం కావలసి వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రితో తమ సంసిద్దత  తెలిపారు. తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తూ తమకు శానిటరీ కిట్లను అందజేసిన మంత్రి కి జర్నలిస్టులు ఈ సందర్భంగా తమ కృతజ్ఞతలు తెలిపారు.


logo