బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 01:43:39

వినయ్‌ రాతకు దునియా ఫిదా

వినయ్‌ రాతకు దునియా ఫిదా

  • బైడెన్‌ ప్రసంగ రచన కరీంనగర్‌ బిడ్డదే
  • వినయ్‌రెడ్డిపై ప్రముఖుల ప్రశంసలు

‘ఐకమత్యం లేకుండా శాంతి లేదు. ఐకమత్యం లేకుండా అభివృద్ధి లేదు. ఐకమత్యం లేకుండా అసలు దేశమే లేదు. మనం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ముందుకు వెళ్లడానికి ఉన్న మార్గం.. ఐకమత్యం ఒక్కటే. అందరం కలిసి ఒక్కటై సాగుదాం’ అని ప్రమాణ స్వీకారం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు ఇవి. ప్రపంచమంతా ముక్తకంఠంతో స్వాగతించిన బైడెన్‌ ప్రసంగాన్ని రాసింది ఎవరో కాదు. మన తెలంగాణ బిడ్డే. పేరు చొల్లేటి వినయ్‌రెడ్డి.

కరీంనగర్‌, జనవరి 21 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్‌ రూరల్‌: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, ఐకమత్యం విలువను చాటిన బైడెన్‌ ప్రసంగాన్ని రాసిన వినయ్‌ది కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం, పోతిరెడ్డిపేట.  బైడెన్‌ ప్రసంగాన్ని రాసిన వినయ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ‘బైడెన్‌ ప్రసంగంలో విన మ్రత, కఠినత్వం, ప్రశాంతత, స్ఫూర్తి.. అన్నీ ఉన్నాయి’ అని చరిత్రకారుడు మైకేల్‌ బెక్లాస్‌ ట్వీట్‌ చేశారు. ‘అమెరికన్లకు, అమెరికాకు ఈ సమయం లో ఎలాంటి మాటలు అవసరమో ప్రసంగంలో అదే ఉంది. అద్భుత ప్రసంగం’ అని ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ కాలమిస్టు డేవిడ్‌ ఫ్రెంచ్‌ ట్వీట్‌చేశారు. 

శ్వేతసౌధంలో స్పీచ్‌ రైటర్‌ డైరెక్టర్‌గా

బైడెన్‌ బృందంలో వినయ్‌రెడ్డికి అత్యంత కీలక పదవి దక్కింది. అమెరికాలోనే పుట్టిపెరిగిన వినయ్‌ అక్కడే లా చదివారు. తొలుత ఆయన ‘యూఎస్‌ ఎన్విరాన్మెంట్‌ ఏజె న్సీ, యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమెన్‌ సర్వీసెస్‌'లో స్పీచ్‌ రైటర్‌గా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన బైడెన్‌కు, కమలా హ్యారిస్‌కు స్పీచ్‌రైటర్‌గా, ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. ఈ ఇద్దరు నేతలు ప్రజాభిమానాన్ని చూరగొనడంలో వినయ్‌ ప్రసంగాలు దోహదపడినట్టు తెలుస్తున్నది. తాను అధ్యక్షుడిగా ఎన్నికవడంలో కీలకపాత్ర పోషించిన వినయ్‌ను బైడెన్‌ శ్వే తసౌధంలో స్పీచ్‌ రైటర్‌ డైరెక్టర్‌గా నియమించారు. 

పోతిరెడ్డిపేటలో సంబురాలు

అమెరికా అధ్యక్షుడి అంతరంగిక బృందంలో తమ గ్రామవాసికి చోటు దక్కడంపై పోతిరెడ్డిపేట గ్రామస్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వినయ్‌ తా త తిరుపతిరెడ్డి 1988 వరకు ఏకధాటిగా 30 ఏండ్లపాటు పోతిరెడ్డిపేట సర్పంచ్‌గా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారుడు. రెండోవాడైన నారాయణరెడ్డి ఎంబీబీఎస్‌ చదివి పీజీ చేసేందుకు 1970 లో అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడిన ఆయన గట్టెపల్లికి చెందిన విజయారెడ్డిని వివాహామాడారు. వీరికి ముగ్గురు కుమారులు. రెండోవాడు వినయ్‌రెడ్డి. ఇతని సోదరులు, వారి భార్యలు కూడా అమెరికాలో వైద్యులు. వినయ్‌ లా చదవగా, ఆయన భార్య ఫిజియోథెరపిస్ట్‌. నారాయణరెడ్డి కుటుంబం తమ గ్రామాన్ని మరచిపోలేదని సర్పంచ్‌ పుల్లాచారి చెప్పారు. పోచమ్మగుడికి, పాఠశాలకు విరాళమిచ్చారని తెలిపారు. వీరికి మూడెకరాల భూమి, శిథిలావస్థకు చేరిన ఇల్లు ఉన్నట్టు చెప్పారు.

VIDEOS

logo