శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 22, 2020 , 01:24:56

ఉపాధిలో రికార్డు.. రాష్ట్రంలో జోరుగా ఉపాధి హామీ

ఉపాధిలో రికార్డు.. రాష్ట్రంలో జోరుగా ఉపాధి హామీ

  • నిత్యం పనుల్లోకి 25 లక్షల మంది  
  • నెలన్నరలోనే 3.75 కోట్ల పనిదినాలు
  • లాక్‌డౌన్‌తో పెరిగిన జాబ్‌కార్డులు  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధిహామీ పథకం అమలులో తెలంగాణ దూసుకెళ్తున్నది. ఐదేండ్లలో ఎప్పుడూలేనంతగా.. వారం రోజులుగా నిత్యం 25 లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అమలుచేస్తున్న పలు పథకాలతో కూలీలకు కావాల్సినంత పని దొరుకుతున్నది. రాష్ట్రంలో ఈ ఏడాది 13 కోట్ల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యం నిర్దేశించుకొన్నది. కాగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కూడా పూర్తికాకముందే 3.75 కోట్ల పని దినాలను తెలంగాణ పూర్తి చేసింది. లాక్‌డౌన్‌తో పట్టణాలు, నగరాల్లో చిన్నచిన్న పనులు చేసుకొన్న వారంతా సొంతూర్లకు చేరారు. చేసేందుకు వేరే పని దొరక్క గతంలో అడ్డా కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లతోపాటు చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకున్నవారు సైతం ఉపాధి కూలీలుగా మారుతున్నారు. దీంతో పనులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 

పల్లెప్రగతి కీలక భూమిక

నిత్యం 25 లక్షల మందికి పనులు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం కింద వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం, హరితహారంలో భాగంగా నర్సరీల ఏర్పాటు  మొదలైన పనులు చురు గ్గా సాగుతున్నాయి. వీటితోపాటు కందకాల తవ్వకం, వ్యవసాయ భూముల్లో ఫాంపాండ్లు, గ్రామాల్లో చేపల పెంపకానికి కుంటల తవ్వకాలు, చెరువుల్లో పూడికతీత, కాలువల పునరుద్ధరణ పనులు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో రోజుకు సగటున 196 మంది ఉపాధి పనుల్లోకి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ ఏడాది ఇప్పటివరకు సగటున ఒక్కొక్కరికీ 13.93 రోజుల పని కల్పిస్తే, తెలంగాణ 17.02 రోజుల పని కల్పించడం విశేషం. 

గత ఐదేండ్లలో ఇదే అత్యధికం 

రాష్ట్రంలో గడిచిన ఐదేండ్లలో ఎన్నడూ ఇంత పెద్దసంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది ఇదే సమయానికి 16,45,680 మంది పనుల్లోకి రాగా గురువారం 25,05,440 మంది కూలీలు హాజరయ్యారు. 2019లో (6,45,680), 2018లో (19,08,547), 2017లో (19,64,025), 2016లో (11,11,567), 2015లో (12,62,145) మంది కూలీలు ఈ సమయానికి పనిక్షేత్రాల్లో ఉన్నారు. గతేడాది మొత్తం మీద 2,08,327 మందికి కొత్తగా జాబ్‌కార్డులు ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే 1,96,673 మందికి జాబ్‌కార్డులు జారీ చేసి పనుల్లోకి తీసుకోవడం గమనార్హం. 

  • రాష్ట్రంలో మొత్తం జాబ్‌కార్డులు  1,17,31,894
  • పనుల్లోకి వచ్చే యాక్టివ్‌ కూలీలు 59,95,934
  • ఈ ఏడాది ఇప్పటివరకు పనుల్లోకి వచ్చిన కూలీలు: 34,42,302 
  • ఈ ఏడాది కొత్త జాబ్‌కార్డులు 1,96,673


logo