సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 03:12:04

విద్యాసంస్థల్లో ఈ-పాఠాలే!

విద్యాసంస్థల్లో ఈ-పాఠాలే!

  • టీవీలతో బోధన, వర్క్‌షీట్లతో సాధన
  • విద్యాక్యాలెండర్‌పై సర్కారుకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త విద్యాసంవత్సరంపై విద్యాశాఖ దృష్టి సారించింది. క్లాస్‌రూం బోధన సాధ్యమయ్యే అవకాశాలు లేనందున డిజిటల్‌ బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. జీరో ఇయర్‌ వల్ల విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోవటమే కాకుండా భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్‌ బోధనే ప్రత్యామ్నాయం అవుతుందని చెప్తున్నారు. విద్యార్థులకు డిజిటల్‌ బోధన అందించి, పాఠాలను వర్క్‌షీట్ల ద్వారా సాధన చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సరికొత్త విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశాలున్నాయి. 6-10 తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని గతంలోనే ఆన్‌లైన్‌ పాఠాలను రూపొందించారు. వాటిని అందుబాటులోకి తీసుకువస్తే సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం గ్రహించింది. గ్రామీణ ప్రాంతాలు, పేదలకు స్మార్ట్‌ఫోన్లు, డాటా, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నందున ఆన్‌లైన్‌ బోధనకు ప్రత్యామ్నయంగా డిజిటల్‌ బోధనకు సర్వం సిద్ధం చేస్తున్నది. టీశాట్‌, మన టీవీ, నిపుణ వంటి టీవీ చానళ్ల ద్వారా డిజిటల్‌ బోధన చేయబోతున్నారు. రోజూవారీ టైంటేబుల్‌ ప్రకారం పాఠాలు బోధించనున్నారు. అయితే, సిలబస్‌ తగ్గింపుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, డిజిటల్‌ బోధన, వర్క్‌షీట్ల సాధనకు టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వెబినార్‌ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్‌ను కూడా ఎస్సీఈఆర్టీ ఖరారు చేసినట్టు తెలిసింది. అటు.. విద్యార్థుల ఇండ్లలో టీవీలు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా టీచర్లు చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం టీశాట్‌, మనటీవీ, నిపుణ వంటి చానళ్ల ప్రసారాలు అన్ని కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా జరుగడం లేదు. ముఖ్యంగా డీటీహెచ్‌ నుంచి ప్రసారాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో డీటీహెచ్‌, కేబుల్‌ ఆపరేటర్లు, స్థానిక కేబుల్‌ ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీవీల్లో పాఠాలు బోధించే అంశాలపై సర్కారు ఆమోదించాల్సి ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇంజినీరింగ్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల బోధనపై జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు దృష్టి సారించారు. దాదాపు 98 శాతం మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి అవకాశాలు ఉన్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. రోజు రెండు, మూడు సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేలా విద్యాక్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌హుస్సేన్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో కనిపించే విద్యార్థి ఇమేజ్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసుకొని, దాన్ని అటెండెన్స్‌గా పరిగణించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు.


logo