బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 01:43:43

డీజీపీ మహేందర్‌రెడ్డి.. డాక్టర్‌!

డీజీపీ మహేందర్‌రెడ్డి.. డాక్టర్‌!

  • జేఎన్టీయూహెచ్‌ నుంచి పీహెచ్‌డీ పట్టా
  • డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్‌
  • ఘనంగా జేఎన్టీయూహెచ్‌ 9వ స్నాతకోత్సవం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కేపీహెచ్‌బీ కాలనీ: రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పేరు ముందు డాక్టర్‌ చేరింది. జేఎన్టీయూహెచ్‌ నుంచి ఆయన పీహెచ్‌డీ పట్టా పొందడంతో డాక్టర్‌ మహేందర్‌రెడ్డిగా మారారు. ఆయన ‘ఏ స్టడీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంటర్వేషన్‌ ఫర్‌ ఎన్‌హ్యాన్సింగ్‌ ద ఎఫెక్టివ్‌నెస్‌ ఆఫ్‌ టీఎస్‌ పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌' అంశంపై పరిశోధన చేశారు. కొత్త విషయాలు నేర్చుకోవడం తనకు ఇష్టమని, చదువుకున్న విద్యాలయం నుంచే పట్టాపొందడం ఆనందంగా ఉన్నదని డీజీపీ చెప్పారు. మరోవైపు, డీఆర్డీవో చైర్మన్‌ డాక్టర్‌ జీ సతీశ్‌రెడ్డి సైతం జేఎన్టీయూహెచ్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. శుక్రవారం జేఎన్టీయూహెచ్‌ 9వ స్నాతకోత్సవాన్ని వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. యువత సవాళ్లను అధిగమించ డానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిగ్రీలతో సంతృప్తి చెందొద్దని, జీవితంలో విజయం కోసం నిరంతరం శ్రమించాలని చెప్పారు. బతుకమ్మ గురించి ప్రస్తావిస్తూ.. పండుగలను ఉత్సాహంతో జరుపుకోవడం ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్స వంలో విద్యార్థులకు 53 బంగారు పతకాలు, 78,395 డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్‌ ఇంచార్జి వైస్‌చాన్స్‌లర్‌ జయేశ్‌రంజన్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo