శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 02:46:10

కొత్త కోర్సులకు రెడీ

కొత్త కోర్సులకు రెడీ
  • జేఎన్టీయూహెచ్‌ పరిధిలో
  • 70 ఇంజినీరింగ్‌ కాలేజీల ఆసక్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జేఎన్టీయూహెచ్‌ కొత్తగా ప్రవేశపెట్టిన ఆరు కోర్సులను అందించేందుకు 70 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు ముందుకొచ్చాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎల్వోటీ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, డాటా అనాలిసిస్‌ లాంటి కోర్సులను తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. కొత్త కోర్సు లు బోధించేందుకు అవసరమైన సదుపాయాలను ఆయా కాలేజీల్లో కల్పించారా? లేదా? అనే అంశాలను తనిఖీల బృందం పరిశీలించి యూనివర్సిటీకి నివేదిక అందజేస్తుందని, ఆ తర్వాతే ఎన్ని కాలేజీల్లో కొత్త కోర్సులకు అఫిలియేషన్‌ ఇవ్వాలన్న అంశంపై స్పష్టత ఇస్తామని జేఎన్టీయూహెచ్‌ ఇంచార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. కొత్త కోర్సుల బోధన, టీచింగ్‌ ఫ్యాకల్టీ విషయంలో అన్ని నిబంధనలు పాటిస్తామని చెప్పారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన అఫిలియేషన్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 11 వరకు ఉన్నదని గోవర్ధన్‌ తెలిపారు.


మూతపడనున్న 16 ఇంజినీరింగ్‌ కాలేజీలు

జేఎన్టీయూహెచ్‌ పరిధిలోని 16 ఇంజినీరింగ్‌ కాలేజీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తమ కాలేజీల మూసివేతకు అనుమతి ఇవ్వాలని ఆయా యాజమాన్యాలు వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. 2015 నాటికి తెలంగాణలో 248 ఇంజినీరింగ్‌ కాలేజీలుండగా.. గతేడాదికి వాటి సంఖ్య 183 కి తగ్గింది.


logo