మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:08

రూ.39కే కరోనా ట్యాబ్లెట్‌

రూ.39కే కరోనా ట్యాబ్లెట్‌

  • ఫావివెంట్‌ పేరుతో మార్కెట్‌లోకి
  • విడుదల చేసిన జెన్‌బర్క్‌ ఫార్మా
  • రూ.68కి సిప్లా కంపెనీ గోళీ
  • ఆప్టిమస్‌ ఫార్మా నుంచి ఫావికొవిడ్‌-200
  • దిగివస్తున్న ఫావిపిరవిర్‌ ధరలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా చికిత్సలో సమర్థంగా పనిచేస్తున్న ఔషధాల్లో ఒకటైన ‘ఫావిపిరవిర్‌' ట్యాబ్లెట్ల ధరలు వరుసగా దిగివస్తున్నాయి. దేశీయ జెనెరిక్‌ మందు తయారీతో ఈ ట్యాబ్లెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, రూ.39కే కరోనా ట్యాబ్లెట్‌ అందజేస్తామని జెన్‌బర్క్‌ ఫార్మాసూటికల్స్‌ కంపెనీ తెలిపింది. ఫావివెంట్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు వెల్లడించింది. కంపెనీ చైర్మన్‌ ఆశిశ్‌ యూ భూటా మాట్లాడుతూ.. ఒక్కో ట్యాబ్లెట్‌ 200 మిల్లీగ్రాముల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఒక్కో స్ట్రిప్‌లో 10 ట్యాబ్లెట్లు వస్తాయని తెలిపారు. అటు.. ఫావిపిరవిర్‌ మందుల తయారీకి సిప్లా ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. దీంతో సిప్లెంజా పేరుతో ట్యాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్టు ఆ కంపెనీ పేర్కొన్నది. రూ.68కి ఒక ట్యాబ్లెట్‌ను అందజేయనున్నట్టు తెలిపింది. ఈ ఔషధం తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌ ఐఐసీటీ అందించడం విశేషం. జపాన్‌కు చెందిన ఫార్మాసంస్థ ‘ఫావిపిరవిర్‌' పేరుతో యాంటీ వైరల్‌ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. దీని ధర చాలా ఎక్కువ. దీంతో దేశీయంగా జెనరిక్‌ మందును తయారుచేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఐఐసీటీ హైదరాబాద్‌ను సంప్రదించగా స్థానికంగా దొరికే రసాయనాలతో ఫావిపిరవిర్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతను సిప్లాకు బదిలీ చేశారు. ప్రస్తుతం గ్లెన్‌మార్క్‌కు చెందిన ‘ఫాబిఫ్లూ’ రూ.75కు ఒక ట్యాబ్లెట్‌ చొప్పున అందుబాటులో ఉన్నది. మహారాష్ట్రకు చెందిన బ్రింటన్‌ ఫార్మా ‘ఫావిటన్‌' పేరుతో రూ.59కే అందిస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా ‘ఫావికొవిడ్‌-200’ పేరుతో త్వరలో ట్యాబ్లెట్లను విక్రయించనున్నట్టు చెప్పింది. బయోఫోర్‌ సంస్థ కూడా త్వరలో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్లను విడుదల చేయనున్నది. 

ఫార్మాకంపెనీ
ట్యాబ్లెట్‌ పేరు
ధర
జెన్‌బర్క్‌
ఫావివెన్‌
రూ.39
బ్రింటన్‌
ఫావిటన్‌
రూ.59
సిప్లా
సిప్లెంజా
రూ.68
గ్లెన్‌మార్క్‌
ఫాబిఫ్లూ
రూ.75
ఆప్టిమస్‌
ఫావికొవిడ్‌-200
ప్రకటించలేదు











logo