ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 00:44:01

జేఈఈలో నాలుగు దశలకు.. ఒకేసారి దరఖాస్తు చేయొచ్చు

జేఈఈలో నాలుగు దశలకు.. ఒకేసారి దరఖాస్తు చేయొచ్చు

  • ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్‌ డైరెక్టర్‌ సాధన పరాశర్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యే విద్యార్థులు పరీక్షలో తమ స్కోర్‌ను మెరుగుపరుచుకొనేందుకు నాలుగుసార్లు పరీక్షలకు హాజరుకావచ్చని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. విద్యార్థులు నాలుగింటికి నాలుగు లేదా ఏ ఒక్క పరీక్షకైనా హాజరుకావొచ్చని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాధన పరాశర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగు దశల్లో పరీక్షలు రాయాలనుకొనే విద్యార్థులు ఒకేసారి పరీక్ష ఫీజును చెల్లించాలని, అన్నీ కలిపి సింగిల్‌ కన్ఫర్మేషన్‌ ఫేజ్‌లో దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. నాలుగు పరీక్షలు రాస్తే ఎందులో ఉత్తమ స్కోర్‌ వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకొంటామని తెలిపారు.

  • సబ్జెక్టుకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. సెక్షన్‌ -ఏ బహులైచ్చిక ప్రశ్నలు, సెక్షన్‌ - బీ న్యూమరికల్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. సెక్షన్‌-బీ పేపర్‌లో 10 ప్రశ్నలకుగాను 5 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది.
  • ఒక విద్యార్థి ఒక్కసారే దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుంది. పొరపాటు జరుగకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • ఏదేనీ ఒకే సెషన్‌ లేదా ఒకటికి మించి హాజరవ్వాలనుకొంటే వేర్వేరు ఫార్మాట్లలో దరఖాస్తు చేసుకోవాలి.
  • కరోనాతో చాలా రాష్ర్టాలు సిలబస్‌ను తగ్గించగా, జేఈఈ ప్రశ్నపత్రాన్ని 90 ప్రశ్నలకు పరిమితం చేసింది. వీటిలో 75 ప్రశ్నలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
  • పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)లో ఉంటుంది. బీఆర్క్‌కు సంబంధించిన డ్రాయింగ్‌ పేపర్‌ మాత్రం రాత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.